ఉక్రెయిన్‌పై దాడి చేసిన రష్యా దళాలు చాలా క్రూరంగా ప్రవర్తిస్తున్నాయి. తాజాగా కీవ్‌కు సమీపంలోని ఒక గ్రామంలో చాలా బాధాకరమైన ఘటన జరిగింది. ఈ ప్రాంతం పూర్తిగా రష్యన్ సైనికుల వశమవడంతో, వాళ్లు దగ్గరలోని స్టోర్స్ అన్నింటిపై పడి లూటీ చేశారని స్థానికులు చెప్తున్నారు. ఈ క్రమంలో అక్కడ వాళ్లకు మద్యం దొరికింది. అది తాగుతూ గోల గోల చేయడం మొదలు పెట్టారని, అదే సమయంలో ఒక తుపాకీ దొరికిన ఒక ఉక్రెయిన్ యువకుడు గాల్లోకి కాల్పులు జరిపాడు.
దీంతో తమపై దాడి జరుగుతుందని అనుకున్న రష్యన్ సైనికులు.. తుపాకీ శబ్దం ఎటు నుంచి వచ్చిందో తెలుసుకోలేకపోయారని, దాంతో నాలుగు ఇళ్లపై కాల్పులు జరిపారని ఆన్యా స్టోలక్ (18) అనే యువతి చెప్పింది. ఈ కాల్పుల్లో తన కజిన్ లూబా కుమార్తె నాస్త్యా (10) దుర్మరణం పాలైందని వెల్లడించింది. అయితే స్మశానానికి వెళ్లడానికి సైనికులు అంగీకరించకపోవడంతో ఇంటి తోటలోనే నాస్త్యాను పూడ్చిపెట్టాల్సి వచ్చిందంటూ వెక్కి వెక్కి ఏడ్చిందామె.
అక్కడ చేసే పనేమీ లేకపోవడంతో సైనికులు చాలా బోర్‌గా ఫీలయ్యారని, ఆ సమయంలోనే యువకుడు తుపాకీ కాల్చడంతో తమపై కాల్పులు జరిగాయని నాస్త్యా తల్లి చెప్పింది. ఘటన జరిగినప్పుడు నాస్త్యా తన అంకుల్‌తో కలిసి ఉందని, ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని వెల్లడించింది. రష్యా చేస్తున్న దాడుల్లో ఇలా చిన్న పిల్లలు ఇప్పటికే చాలా మంది చనిపోయిన సంగతి తెలిసిందే.