Vladimir Putin : ఉక్రెయిన్‌పై రష్యా వరుసగా దాడులు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఉక్రెయిన్‌పై దాడుల్ని మూడు రోజులపాటు నిలిపివేయాల్సిందిగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆదేశించారు. శనివారం నుంచే ఈ ఆదేశాలు అమలవుతాయని పేర్కొన్నారు. దీనికి కారణం.. అమెరికా ప్రతినిధులు రష్యాలో పర్యటిస్తుండటమే. ఉక్రెయిన్‌తో యుద్ధాన్ని ఆపేందుకు అమెరికా ప్రత్యేక ప్రతినిధులు స్టీవ్ విట్కాఫ్, జేర్డ్ కుష్నర్ రష్యాలో పర్యటిస్తున్నారు.
వారి రాక సందర్భంగా ఎలాంటి ఘర్షణ వాతావరణం ఉండకూడదనే ఉద్దేశంతో పుతిన్.. ఉక్రెయిన్‌పై దాడుల్ని నిలిపివేయాలని సైన్యాన్ని ఆదేశించారు. ఇప్పటికే ఇరువురూ రష్యా చేరుకున్నారు. అక్కడ ఉక్రెయిన్‌తో యుద్ధాన్ని నివారించేందుకు, ఇరు దేశాల మధ్య సంధి కుదిర్చేందుకు రష్యాతో చర్చలు జరుపుతారు. రష్యా అధ్యక్షుడి ప్రతినిధి కిరిల్ డిమిత్రీవ్.. ఇద్దరు నేతలు స్టీవ్ విట్కాఫ్, జేర్డ్ కుష్నర్లు వారికి స్వాగతం పలికారు. కిరిల్ డిమిత్రీవ్.. గతంలో కూడా పుతిన్ తరఫున ఉక్రెయిన్ యుద్ధం అంశంపై అమెరికా నేతలతో చర్చలు జరిపారు.
ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేసే అంశంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శుక్రవారం మీడియాతో మాట్లాడారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేందుకు సరికొత్త, బలమైన ప్రతిపాదనలు తమ వద్ద ఉన్నాయని ట్రంప్ అన్నారు. అందుకోసమే తమ దేశ ప్రతినిధుల్ని రష్యా పంపిస్తున్నట్లు చెప్పారు. అయితే, ఆ ప్రతిపాదనలు ఏంటీ అనే విషయాన్ని మాత్రం ట్రంప్ వెల్లడించలేదు. స్టీవ్ విట్కాఫ్, జేర్డ్ కుష్నర్లు గొప్పగా మధ్యవర్తిత్వం చేస్తారని, ఇప్పటికే వాళ్లు చాలా విజయం సాధించారని ట్రంప్ గుర్తు చేశారు.
ఈ చర్చలు ఫలిస్తాయని ఆశిస్తున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు. మరోవైపు.. తమపై దాడులు ఆపాల్సిందిగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ విజ్ఞప్తి చేశారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నాలుగేళ్లకుపైగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.