కీవ్, అక్టోబర్ 26: ఉక్రెయిన్ రాజధాని కీవ్‌పై రష్యా విరుచుకుపడింది. శుక్రవారం రాత్రి డ్రోన్లతో దాడికి దిగింది. ఏడున్నర గంటల పాటు దాడులు జరగడంతో నగరమంతా సైరన్లు మోగాయి. దీంతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. పలు రష్యా డ్రోన్లను కూల్చేసినట్టు ఉక్రెయిన్ ప్రకటించింది. కాగా, నగరంలోని పశ్చిమ ప్రాంతంలో ఓ 25 అంతస్థుల భవనంపై రష్యా డ్రోన్ దాడి చేసిందని, ఈ దాడిలో 15 ఏండ్ల బాలిక మరణించిందని మేయర్ విటలి క్లిట్స్కో తెలిపారు. భవనం నుంచి 100 మందిని రక్షించినట్టు చెప్పారు. మరోవైపు మధ్య ఉక్రెయిన్‌లోని డ్నిప్రో నగరంపై రష్యా క్షిపణి దాడి చేసింది. ఈ దాడిలో 14 ఏండ్ల బాలుడితో పాటు మరో ముగ్గురు మరణించారు. 20 మంది వరకు గాయపడ్డారు. దక్షిణ ఖెర్సన్ ప్రాంతంతో పాటు కీవ్ ప్రావిన్స్‌లోని మరికొన్ని ప్రాంతాలపైనా రష్యా దాడులు జరిపింది. ఈ దాడుల్లో ముగ్గురు మరణించగా, పదుల సంఖ్యలో గాయపడ్డారు.
రష్యా డబ్బులతో ఉక్రెయిన్‌కు రుణాలు
రష్యాతో యుద్ధంలో తీవ్రంగా దెబ్బతిన్న ఉక్రెయిన్ను ఆదుకునేందుకు సుమారు రూ.4.20 లక్షల కోట్ల(50 బిలియన్ డాలర్లు) రుణం ఇవ్వాలని జీ7 దేశాధినేతలు నిర్ణయం తీసుకున్నారు. ఇందులో 20 బిలియన్ డాలర్లు అమెరికా అందించనుండగా, మిగతా 30 బిలియన్ డాలర్ల రుణాలను ఐరోపా, యూకే, కెనడా, జపాన్ అందిస్తాయి. ఈ ఏడాది చివరి నాటికి ఈ రుణాన్ని అందించడం ప్రారంభించాలని నిర్ణయించారు. కాగా, ఉక్రెయిన్‌పై రష్యా దాడి ప్రారంభించగానే తమ దేశాల్లోని రష్యా ఆస్తులను జీ7 దేశాలు స్వాధీనం చేసుకున్నాయి. వాటిపై వచ్చిన లాభాలను సైతం ఉక్రెయిన్‌కు అందించాలని ఆయా దేశాలు నిర్ణయించాయి.