కీవ్ : ఒక పక్క యుద్ధం ఆపడానికి ప్రయత్నాలు కొనసాగుతుండగా, ఉక్రెయిన్పై రష్యా మరోసారి దాడికి దిగింది. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సొంత నగరమైన క్రైవీ రీపై శుక్రవారం రష్యా జరిపిన క్షిపణి దాడుల్లో 18 మంది మరణించగా 61 మంది గాయపడ్డారు. మృతులలో 9 మంది పిల్లలు ఉన్నారని రీజినల్ గవర్నర్ సెర్హిల్ లైసాక్ శనివారం తెలిపారు. నివాస భవనాలకు పక్కన పిల్లల ఆటస్థలం ఉన్న ప్రాంతాన్ని క్షిపణి తాకిందని జెలెన్స్కీ టెలిగ్రామ్లో తెలిపారు. ఆ దాడిలో 20కి పైగా అపార్టుమెంట్ భవనాలు దెబ్బతినగా, 30కి పైగా వాహనాలతో పాటు ఒక విద్యా భవనం, రెస్టారెంట్ కూడా ధ్వంసమయ్యాయని అధికారులు వివరించారు. దాడులు కొనసాగించడం చూస్తుంటే యుద్ధాన్ని విరమించడం రష్యాకు ఇష్టం లేనట్టు కన్పిస్తున్నదని జెలెన్స్కీ విమర్శించారు.