40 రష్యా యుద్ధ విమానాలను పేల్చేసిన వీరుడు తారాబల్కా
మార్చి 13న వీరమరణం
కీవ్, ఏప్రిల్ 30: ఫిబ్రవరి నెల 24వ తారీఖు. ఉక్రెయిన్‌పై పుతిన్ సైనిక చర్యను ప్రకటించారు. రష్యా యుద్ధ విమానాలు ఉక్రెయిన్ రాజధాని కీవ్ వైపునకు ఒకదాని వెంట మరోటి దూసుకువస్తున్నా యి. అన్నింటి కన్నా ముం దుగా వస్తున్న రష్యా యుద్ధ విమానం గాల్లో పేలిపోయింది. ఏం జరిగిందో అర్థమయ్యేలోపు మరో విమానం పేలిపోయింది. రష్యా సైనికులు షాక్ నుంచి తేరుకొనే లోపే మరో యుద్ధ విమానం నేలమట్టమైంది. ఉక్రెయిన్ యుద్ధ వీరుడు, ఫైటర్ పైలట్ మేజర్ స్టెపాన్ తారాబల్కా ఒక్కడే పద్మవ్యూహంలో అభిమన్యుడిలా రష్యా వైమానిక దళ వ్యూహాలను కకావికలం చేశాడు.
కనిపించిన యుద్ధవిమానాన్ని కనిపించినట్టు పేల్చివేశాడు. తారాబల్కా దెబ్బకు యుద్ధం ప్రారంభించిన మొదటి రోజే రష్యాకు చెందిన ఆరు యుద్ధ విమానాలు ధ్వంసమయ్యాయి. తర్వాత కూడా తారాబల్కా గగన వీరవిహారం సాగిం ది. ఒక్కడే 40కి పైగా విమానాలను పేల్చివేశాడు. మార్చి 13న మిగ్-29తో గగన యుద్ధక్షేత్రంలో వీర మరణం పొందాడు. తారాబల్కా చూపిన ధైర్య సాహసాలు, మెరుపుదాడులతో ప్రజలు అతన్ని ‘ఘోస్ట్ ఆఫ్ కీవ్’ అని పిలవడం మొదలు పెట్టారు. భద్రతా కారణాల దృష్ట్యా ఆయన వివరాలను ప్రభుత్వం వెల్లడించకపోవడంతో ప్రజలు అతనికి ఆ పేరు పెట్టుకొన్నారు. మరణం తర్వాత తారాబల్కా వివరాలను ఉక్రెయిన్ ప్రభుత్వం వెల్లడించింది. తాజాగా అతని పేరు మీద ఓ వీడియో విడుదల చేసింది. వీరోచిత పోరాటానికి గాను దేశ అత్యున్నత పురస్కారమైన ‘ఆర్డర్ ఆఫ్ ది గోల్డెన్ స్టార్’తో గౌరవించింది.
డాన్బాస్ కోసం చెమటోడుస్తున్న రష్యా
డాన్బాస్ ప్రాంతాన్ని పూర్తిగా చేజిక్కించుకోవడానికి రష్యా చెమటోడుస్తున్నది. ఉక్రెయిన్ బలగాలు రష్యా సైన్యాన్ని సమర్థంగా ఎదుర్కొంటున్నాయి. మరోవైపు, ఉక్రెయిన్ వ్యాప్తంగా పలు నగరాల్లో రష్యా దాడులు కొనసాగాయి. రష్యా పూర్తిగా పట్టు సాధించిన మరియుపోల్‌లో లక్ష మందిదాకా ఉక్రెయిన్ పౌరులు చిక్కుకుపోయారని భావిస్తున్నారు. వీరికి ఆహారం, నీళ్లు, మందులు అందడం లేదు. ఇక్కడ ఉన్న అజోవ్‌స్టల్ స్టీల్ ప్లాంటులోనే 2వేల మంది ఉక్రెయిన్ సైనికులు, వెయ్యి మంది సాధారణ పౌరులు ఉన్నట్టు అంచనా. ఉక్రెయిన్ తరఫున పోరాడుతూ అమెరికా మాజీ మెరైన్ విల్లీ జోసెఫ్ చనిపోయారు. అయితే అమెరికా ప్రభుత్వం దీన్ని ఇంకా నిర్ధారించలేదు. ఇదిలా ఉండగా, ప్రాణ రక్షణ కోసం కొసోవో పట్టణంలో మహిళలు మందుపాతరలను గుర్తించి నిర్వీర్యం చేయడంలో శిక్షణ పొందుతున్నారు.