ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం తీవ్ర రూపం దాల్చుతున్నది. రెండు అగ్రరాజ్యాలైన అమెరికా, రష్యా మధ్య పెను ఉద్రిక్తతలకు ఇది కారణమవుతున్నది. రెండు దేశాలు చెరో పక్షాన నిలుస్తుండటంతో ఇది మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందేమోనన్న ఆందోళన ప్రపంచ దేశాలలో వ్యక్తమవుతున్నది. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య మధ్యవర్తిత్వం వహించేందుకు తాను సిద్ధమని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ బుధవారం ప్రతిపాదించగా, ముందు ఉక్రెయిన్‌తో జరుగుతున్న యుద్ధంపై మధ్యవర్తిత్వం చేసుకోండని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యంగ్యాస్ర్తాలు సంధించారు.
ఈ క్రమంలో అమెరికాకు రష్యా గట్టి వార్నింగ్ ఇచ్చింది. ఇజ్రాయెల్- ఇరాన్ యుద్ధంలో అమెరికా జోక్యం చేసుకుంటే తామూ రంగంలోకి దిగుతామని, తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించింది. కాగా, ఇజ్రాయెల్‌లోని బీర్షెబాలో ఉన్న దవాఖానపై ఇరాన్ విరుచుకుపడింది. ఈ దాడిలో పలువురు గాయపడ్డారు. దీనిని యుద్ధ చర్యగా అభివర్ణించిన ఇజ్రాయెల్, ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని అంతం చేస్తామని హెచ్చరించింది.
న్యూఢిల్లీ: ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం తీవ్ర రూపం దాల్చుతున్నది. రెండు అగ్రరాజ్యాలైన అమెరికా, రష్యా మధ్య పెను ఉద్రిక్తతలకు ఇది కారణమవుతున్నది. రెండు దేశాలు చెరో పక్షాన నిలుస్తుండటంతో ఇది మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందేమోనన్న ఆందోళన ప్రపంచ దేశాలలో వ్యక్తమవుతున్నది. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య సయోధ్య కుదర్చడానికి మధ్యవర్తిత్వం వహించడానికి తాను సిద్ధమని రష్యా అధ్యక్షుడు పుతిన్ బుధవారం ప్రకటించారు. ఇరాన్ తన అణు కార్యక్రమాన్ని శాంతియుతంగా నిర్వహించుకునేందుకు వీలుగా ఒక ఒప్పందం కుదర్చడంలో తాను సాయపడతానని పుతిన్ ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పందిస్తూ ముందుగా ఉక్రెయిన్‌తో సాగిస్తున్న తన సొంత యుద్ధానికి పుతిన్ ముగింపు పలకాలని వ్యాఖ్యానించారు.
ఇరాన్‌పై యుద్ధంలో ఇజ్రాయెల్‌కు బహిరంగ మద్దతు ప్రకటించిన ట్రంప్ తన సైనిక బలగాలను పశ్చిమాసియాలో అదనంగా మోహరించడంపై రష్యా తీవ్రంగా స్పందించింది. ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధంలో అమెరికా సైన్యం జోక్యం చేసుకుంటే తాము కూడా యుద్ధంలో చేరతామని రష్యా గురువారం ప్రకటించింది. ఆ రెండు దేశాల మధ్య ఘర్షణలు ఉగ్రరూపం దాలుస్తున్న పరిస్థితులలో అమెరికా సైన్యం జోక్యం చేసుకోవడం అత్యంత ప్రమాదకరమని రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి మరియా జఖారోవా హెచ్చరించారు. ఇది అనూహ్యమైన ప్రతికూల పరిణామాలకు దారితీయగలదని ఆమె అమెరికాను హెచ్చరించారు.
రెండు వారాల్లోగా నిర్ణయం : వైట్‌హౌజ్ ఇరాన్‌పై దాడి చేయాలా వద్దా అన్నదానిపై ట్రంప్ రెండు వారాల్లోగా నిర్ణయం తీసుకోనున్నట్టు శ్వేతసౌధం తెలిపింది.
దక్షిణ ఇజ్రాయెల్‌లోని ఓ ప్రధాన దవాఖానపై గురువారం తెల్లవారుజామున ఇరాన్ జరిపిన క్షిపణి దాడి తీవ్ర విధ్వంసాన్ని సృష్టించింది. అయితే తీవ్రమైన గాయాలు ఎవరికీ కాలేదని దవాఖాన యాజమాన్యం ప్రకటించింది. కాగా, టెల్ అవీవ్ సమీపంలోని అనేక బహుళ అంతస్తుల భవనాలు, ఇతర నివాస భవనాలపై ఇరాన్ క్షిపణులు దాడి చేశాయి. ఈ దాడులలో కనీసం 47 మంది గాయపడినట్లు ఇజ్రాయెల్ మాగెన్ డేవిడ్ ఆడమ్ రెస్క్యూ సర్వీస్ తెలిపింది. బీర్షేబా నగరంలోని సొరోకా వైద్య కేంద్రంపై క్షిపణి దాడి జరగడంతో దట్టమైన నల్లని పొగ ఆ ప్రాంతంలో వ్యాపించింది. దవాఖానలోని రోగులను ఎమర్జెన్సీ బృందాలు వేరే దవాఖానలకు తరలించాయి.
బీర్షేబాలోని ప్రధాన దవాఖానపై ఇరాన్ క్షిపణి దాడి జరిగిందని ఇద్దరు వైద్యులు అసోసియేటెడ్ ప్రెస్‌కి తెలిపారు. వైమానిక దాడి హెచ్చరిక సైరన్లు ఆగిపోయిన వెంటనే దవాఖానపై క్షిపణి దాడి జరిగిందని వారు చెప్పారు. సురక్షిత గది నుంచి కూడా తమకు భారీ శబ్దాలు వినిపించాయని వారు తెలిపారు. కొన్ని రోజుల క్రితం రోగులను వేరే చొటుకు తరలించిన పాత సర్జరీ భవనం క్షిపణి దాడిలో ధ్వంసమైందని దవాఖాన యాజమాన్యం తెలిపింది. విషమ పరిస్థితులలో ఉన్న రోగులను ఉంచుకుని మిగిలిన రోగులందరినీ వేరే దవాఖానాలకు తరలించామని వారు చెప్పారు. సొరోకా వైద్య కేంద్రంలో 1,000కిపైగా పడకలు ఉన్నాయి. ఆ ప్రాంతంలో నివసిస్తున్న 10 లక్షల మందికి పైగా ప్రజలకు ఈ దవాఖాన ప్రధానంగా వైద్య సేవలు అందిస్తున్నది.
సొరోకా వైద్య కేంద్రంపై ఇరాన్ క్షిపణి దాడిని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తీవ్రంగా ఖండించారు. దీనికి గట్టి జవాబు ఇస్తామని ఆయన ప్రకటించారు. టెహ్రాన్‌లోని నిరంకుశులు దీనికి భారీ మూల్యం చెల్లించుకోవలసి ఉంటుందని ఆయన హెచ్చరించారు.
దవాఖానపై జరిగిన దాడిలో చాలామందికి స్వల్ప గాయాలయ్యాయని స్థానిక పోలీసు కమాండర్ హయిమ్ బుబ్లిల్ విలేకరులకు తెలిపారు. ఇజ్రాయెల్‌లోని చాలా దవాఖానలు గత వారం అత్యవసర వార్డులను తెరిచాయి. అండర్‌గ్రౌండ్ పార్కింగ్ ప్రదేశాలను దవాఖాన వార్డులుగా మార్చివేసిన యాజమాన్యాలు రోగులను ముఖ్యంగా వెంటిలేటర్లపైన ఉన్న రోగులు, కదలడానికి వీల్లేని స్థితిలో ఉన్న వారిని తరలించి చికిత్స అందచేస్తున్నారు.
దవాఖానపై క్షిపణి దాడి తమ లక్ష్యం కాదని ఇరాన్ గురువారం ప్రకటించింది. దవాఖాన సమీపంలో ఉన్న సైనిక, నిఘా స్థావరాలను లక్ష్యంగా చేసుకుని తాము క్షిపణిని ప్రయోగించినట్లు ఇరాన్ వివరించింది. సొకా దవాఖాన సమీపంలో ఉన్న గవ్ యామ్ టెక్నాలజీ పార్కులో ఉన్న ఇజ్రాయెల్ ఆర్మీ కమాండ్, ఇంటెలిజెన్స్ బేస్(ఐడీఎఫ్ సీ41), ఆర్మీ ఇంటెలిజెన్స్ క్యాంపును లక్ష్యంగా చేసుకుని తాము దాడి చేసినట్లు ఇరాన్ ప్రభుత్వ వార్తా సంస్థ ఇర్నా పేర్కొంది.
ఇరాన్ సుప్రీం నాయకుడు అయాతొల్లా అలీ ఖమేనీ బతకడానికి వీల్లేదని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కట్జ్ ప్రకటించారు. టెల్ అవీవ్ సమీపంలోని ఓ దవాఖానపై ఇరాన్ క్షిపణి దాడి చేయడంపై గురువారం ఆయన తీవ్రంగా స్పందించారు. దవాఖానపై జరిగిన క్షిపణి దాడికి ఖమేనీ బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు. బంకర్లో తలదాచుకున్న ఇరానియన్ నియంత ఇజ్రాయెల్‌లోని దవాఖానలు, నివాస భవనాలపై పిరికిపందలా క్షిపణులతో దాడులు చేస్తున్నారని కట్జ్ ఆరోపించారు. ఇవి చాలా తీవ్రమైన యుద్ధ నేరాలని, ఈ నేరాలకు ఖమేనీని జవాబుదారీగా నిలబెడతామని హెచ్చరించారు. ఖమేనీని అంతం చేయడానికి ఇజ్రాయెల్ రక్షణ దళాలు(ఐడీఎఫ్) ఎంత దూరం వెళ్లడానికైనా సిద్ధమని ఆయన ప్రకటించారు. ఖమేనీ పాలనను అంతం చేసేందుకు దాడులను ముమ్మరం చేయాలని తాను, ప్రధాని నెతన్యాహు ఐడీఎఫ్ని ఆదేశించినట్లు ఆయన తెలిపారు.