న్యూఢిల్లీ: అంటార్కిటికాలోని వెడెల్ సముద్ర ప్రాంతంలో 511 బిలియన్ (51,100 కోట్ల) బ్యారెళ్ల చమురు నిక్షేపాలను రష్యా పరిశోధకులు గుర్తించారు. చమురు నిక్షేపాల గనిగా పరిగణించే సౌదీ అరేబియాలోని నిక్షేపాల కన్నా రెండు రెట్లు ఎక్కువ పరిమాణం అంటార్కిటికాలో ఉన్నట్లు తెలుస్తున్నది. తమ శాస్త్రీయ పరిశోధనలో ఈ చమురు నిల్వలను గుర్తించినట్లు రష్యా తెలిపింది. ఈ నిక్షేపాల గుర్తింపు ప్రపంచ భౌగోళిక, రాజకీయాలను పునర్నిర్వచించే అవకాశం ఉంది. ఆధునిక చరిత్రలో ఇంత భారీ స్థాయిలో ఎవరూ వెలికితీయని చమురు నిక్షేపాలు లభించడం ఇదే మొదటిసారని న్యూస్వీక్ తెలిపింది.
గడచిన ఐదు దశాబ్దాలలో ఉత్తర సముద్రం నుంచి వెలికితీసిన చమురుకన్నా ఇది 10 రెట్లు ఎక్కువ పరిమాణమని భావిస్తున్నారు. ఈ చమురు నిక్షేపాల గుర్తింపుతో ప్రపంచ ఇంధన వనరుల సమతుల్యత మార్పునకు లోనై అగ్రరాజ్యాల మధ్య రాజకీయ, సైనిక ఉద్రిక్తతలకు దారితీసే అవకాశం ఉంది. ఒక విధంగా మూడవ ప్రపంచ యుద్ధానికి కూడా ఇది దారితీసే ప్రమాదం ఉన్నట్లు భౌగోళిక, రాజకీయ విశ్లేషకులు ఆందోళన చెందుతున్నారు.
ఈ చమురు నిల్వలను కనిపెట్టడంతో 1959లో కుదిరిన అంటార్కిటికా ఒప్పందం ఏ మేరకు ప్రభావితం అవుతుందో వేచి చూడాల్సి ఉంటుంది. ఈ ఒప్పందంపై అమెరికా, బ్రిటన్, రష్యా, చైనాతోసహా 56 దేశాలు సంతకం చేశాయి. అంటార్కిటికాను నిస్సైనిక, వాణిజ్యరహిత మండలంగా ఈ ఒప్పందం గుర్తించింది. శాంతియుత శాస్త్రీయ పరిశోధనలకు మాత్రమే దీన్ని ఉపయోగించాలని ఒప్పందం నిర్దేశించింది. సైనిక కార్యకలాపాలు, వనరుల వెలికితీత లేదా వాణిజ్య తవ్వకాలు జరపడంపై నిషేధం విధించింది.
బ్రిటన్, అర్జెంటీనా, చిలీతోసహా ఏ దేశమూ అంటార్కిటికాపై తమకే హక్కులు ఉన్నాయని సార్వభౌమత్వ ప్రకటన చేయకూడదు. ఇక్కడ వనరుల తవ్వకాలపై 1991 నాటి మాడ్రిడ్ ప్రొటోకాల్ మరోసారి నిషేధం విధించింది. అన్ని కార్యకలాపాలు పర్యావరణహితంగా,వాణిజ్యరహితంగా ఉండాలి.
సీస్మిక్ సర్వేలు, భౌగోళిక నమూనాల సేకరణ నిర్వహించడం ద్వారా అంతర్జాతీయ ఒప్పందాలను రష్యా ఇప్పటికే ఉల్లంఘించినట్లు నిపుణులు భావిస్తున్నారు. అయితే తమ సర్వేలు పూర్తిగా శాస్త్రీయపరమైనవని రష్యా వాదిస్తున్నప్పటికీ ఈ కార్యకలాపాలు నిర్వహించిన విధానాలు, వాటి పరిధి దౌత్య వర్గాలలో ఆందోళనలు లేవనెత్తుతున్నాయి. ఒప్పందాలను ఉల్లంఘిస్తూ రష్యా వనరుల అన్వేషణ నిర్వహించడంతో అంటార్కిటికాతో సరిహద్దులు పంచుకుంటున్న బ్రిటన్, అర్జెంటినా, చిలీ వంటి దేశాలు తమ అపార చమురు నిక్షేపాలు కలిగిన ఈ మంచుఖండంపై తమ సార్వభౌమత్వాన్ని ప్రకటించుకోవడానికి సాహసించే అవకాశం కూడా లేకపోలేదు.
అదే జరిగితే దక్షిణ ధ్రువం కోసం కొత్త తరహా ప్రచ్ఛన్న యుద్ధం రాజుకునే ప్రమాదం ఉంది. కాగా, రష్యాకు మాత్రమే ఈ చమురు అన్వేషణ పరిమితం కాబోదని, ఇటీవలే తన ఐదవ అంటార్కిటిక్ పరిశోధనా కేంద్రాన్ని ప్రారంభించిన చైనా కూడా రష్యాతో చేతులు కలిపే అవకాశం ఉందని భౌగోళిక, రాజకీయ విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పరిశోధన ముసుగులో ఈ రెండు శక్తులు అంటార్కిటికాలో తిష్ఠ వేస్తే అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా తదితర పశ్చిమ-అలీన దేశాల నుంచి ప్రతిఘటన ఎదురయ్యే అవకాశం ఉందని వారు భావిస్తున్నారు.
ఇలా ఉండగా వనరుల వెలికితీతపై అంటార్కిటికాలో ఉన్న నిషేధాన్ని రష్యా గౌరవించి, ఒప్పందానికి కట్టుబడి ఉండాలని బ్రిటన్ విదేశాంగ కార్యాలయం హెచ్చరించింది. తాజా పరిణామంపై- అమెరికా ప్రత్యక్షంగా స్పందించనప్పటికీ వనరుల వెలికితీత నుంచి అంటార్కిటికాను పరిరక్షించాలన్న విధానాన్ని అమెరికా చారిత్రకంగా పాటిస్తోంది. చమురు వెలికితీతకు సంబంధించి ఎటువంటి ముందడుగు పడినా ఇప్పటికే ఉక్రెయిన్ యుద్ధం విషయంలో ఉద్రిక్తంగా ఉన్న అమెరికా-రష్యా సంబంధాలు మరింత దిగజారే అవకాశం ఉంది.