Smart Shadow Missile | కీవ్, సెప్టెంబర్ 13: రష్యా – ఉక్రెయిన్ యుద్ధం మరింత ముదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి. రష్యాపై దీర్ఘ శ్రేణి క్రూయిజ్ క్షిపణులతో (స్టార్మ్ షాడో క్షిపణులు) దాడికి ఉక్రెయిన్ సిద్ధమవుతున్నట్టు తెలుస్తున్నది. ఈ క్షిపణుల వినియోగానికి ఉక్రెయిన్‌కు నాటో సభ్య దేశమైన యూకే అనుమతి ఇచ్చిందని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.
యూకే, ఫ్రాన్స్ కలిసి అభివృద్ధి చేసిన ఈ క్షిపణులు 500 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలపై కూడా దాడి చేయగలవు. ఇప్పటివరకు రష్యా – ఉక్రెయిన్ సరిహద్దు ప్రాంతాలకు ఎక్కువగా యుద్ధం పరిమితమైంది. ఈ క్షిపణుల ద్వారా రష్యా భూభాగం లోపలి ప్రాంతాల్లోని లక్ష్యాలపై దాడులు చేయాలని ఉక్రెయిన్ భావిస్తున్నది.
ఇదే జరిగితే యుద్ధం తీవ్రరూపం దాల్చే అవకాశం ఉంది. ఒకవేళ ఉక్రెయిన్ కనుక ఈ క్షిపణులు వాడితే, దానికి ఇవి సరఫరా చేసిన నాటో దేశాలు, అమెరికా, యూరోపియన్ దేశాలను కూడా యుద్ధంలోకి లాగినట్టే అవుతుందని గురువారం రష్యా అధ్యక్షుడు పుతిన్ హెచ్చరించారు.