న్యూఢిల్లీ, ఆగస్టు 15: రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికి, అమెరికా, రష్యా మధ్య కొత్త స్నేహానికి దారితీయగలదని ఆశిస్తున్న డొనాల్డ్ ట్రంప్, వ్లాదిమిర్ పుతిన్ మధ్య శిఖరాగ్ర చర్చలు అమెరికన్ భూభాగంలోని అలాస్కాలో మరికొన్ని గంటల్లో జరగనున్నాయి. యావత్ ప్రపంచం ఈ చార్రితక ఘట్టంపై ఆసక్తిగా గమనిస్తుండగా వేల కిలోమీటర్ల దూరంలో జరుగుతున్న ఈ సమావేశం ఎటువంటి ఫలితాన్ని ఇస్తుందోనని భారత్ ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. ఈ సమావేశం ట్రంప్‌కు తనను తాను గొప్ప మధ్యవర్తిగా, ప్రపంచ శాంతిదూతగా ఆవిష్కరించుకునే అవకాశాన్ని కల్పించింది. ఎటువంటి సమస్యనైనా చిటికెలో పరిష్కరించగలనని చెప్పుకునే ట్రంప్‌కు గడచిన మూడున్నరేళ్లుగా సాగుతున్న రక్తపాతాన్ని ఆపేందుకు ఒక పరిష్కార మార్గాన్ని కనుగొనగల శక్తివంతమైన సంధానకర్తగా నిరూపించుకునే అవకాశాన్ని ఈ సమావేశం కల్పించింది.
రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు సంబంధించినంత వరకు రష్యా సరిహద్దులను విస్తరించుకోవడం, నాటోలోకి ఉక్రెయిన్ ప్రవేశాన్ని అడ్డుకోవడం వంటి డిమాండ్లను గట్టిగా ట్రంప్ ఎదుట ఈ సమావేశంలో ఉంచే అవకాశం ఉంది. అంతేగాక 2022లో ఉక్రెయిన్‌ని దురాక్రమించిన తర్వాత ప్రపంచ దేశాలకు దూరమైన పుతిన్‌కు ఈ సమావేశం ద్వారా తన వాదనకు బలం చేకూరుతుందని ఆశిస్తున్నారు. అయితే చర్చలలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని చేర్చుకోకపోవడం ఉక్రెయిన్ పట్ల అమెరికాకు ఉన్న చులకనభావాన్ని బయటపెడుతోంది.
ఉక్రెయిన్ అంగీకరించడానికి ఇష్టపడని డిమాండ్లను ట్రంప్ ఒప్పుకుంటే తదుపరి పరిణామాలు ఏమిటన్న ఆందోళన కూడా ప్రపంచ దేశాలలో వ్యక్తమవుతోంది. ట్రంప్, పుతిన్ మధ్య చర్చలలో యుద్ధానికి ఒక పరిష్కారం లభించే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి. శాంతి కోసం రష్యా, ఉక్రెయిన్ పెడుతున్న షరతులు కూడా పొంతన లేకుండా ఉన్నాయి. కాల్పుల విరమణ కోసం ఉక్రెయిన్‌కి పశ్చిమ దేశాల నుంచి ఆయుధాల సరఫరా నిలిపివేయాలని, ఉక్రెయిన్ ఆయుధాల సమీకరణ స్తంభింపచేయాలని పుతిన్ పెడుతున్న షరతులను ఉక్రెయిన్, దాని మిత్రదేశాలు ఇప్పటికే తిరస్కరించాయి.
ఈ సమావేశం తర్వాత అలాస్కాలోనే జెలెన్స్కీతో కలిపి మరో సమావేశం ఏర్పాటు చేస్తామని ట్రంప్ చేసిన ప్రతిపాదనను పుతిన్ తిరస్కరించారు. కాగా, పుతిన్‌తో జరిగే చర్చలలో తక్షణమే కాల్పుల విరమణపై అవగాహన కుదురుతుందని తాను కచ్చితంగా చెప్పలేనని గురువార ఫాక్స్ న్యూస్ రేడియో ఇంటర్వ్యూలో ట్రంప్ అన్నారు. సాధ్యమైనంత త్వరగా విస్తృత శాంతి ఒప్పందం కుదరాలన్న తన ఆకాంక్షను ఆయన పునరుద్ఘాటించారు.
ట్రంప్-పుతిన్ శిఖరాగ్ర చర్చలపై భారత్ ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. భారత్, అమెరికా మధ్య ఇటీవల ఏర్పడిన ఉద్రిక్తతలు తొలగిపోవడానికి ఈ సమావేశం దోహదపడగలదని భారత్ ఆశిస్తోంది. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న కారణంతో భారత్ నుంచి దిగుమతి చేసుకుంటున్న వస్తువులపై ట్రంప్ 50 శాతం సుంకాలు విధించిన నేపథ్యంలో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు తలెత్తాయి. ఉక్రెయిన్‌తో యుద్ధం చేసేందుకు చమురు కొనుగోలు ద్వారా భారత్ రష్యాకు నిధులు సమకూరుస్తున్నట్లు ట్రంప్ వాదిస్తున్నారు.
అమెరికా చర్యను తిరస్కరించిన భారత్ అమెరికా విధించిన సుంకాలను అనుచితం, అన్యాయం, అహేతుకంగా అభివర్ణించింది. మొదట్లో తాము రష్యా నుంచి తక్కువ స్థాయిలో చమురు కొనుగోలు చేశామని, అమెరికా ప్రోత్సాహంతో తాము కొనుగోళ్లు పెంచామని భారత్ తెలిపింది. అమెరికా చర్యను పాశ్చాత్య ఆత్మవంచనగా అభివర్ణించిన భారత్ రష్యా నుంచి అమెరికా, యూరపు వాణిజ్యం కొనసాగిస్తున్న విషయాన్ని గుర్తు చేసింది. అయితే, భారత్‌పై విధించిన అదనపు సుంకాలు పుతిన్ తనతో చర్చలకు ఒప్పుకోవడంలో కీలక పాత్ర పోషించి ఉంటాయని గురువారం ట్రంప్ వ్యాఖ్యానించడం గమనార్హం.