ఉక్రెయిన్ తూర్పు ప్రాంతాలపై రష్యా బలగాల దాడులు
పారిశ్రామిక నగరం డాన్బాస్
ఆక్రమణే లక్ష్యంగా ముందుకు
రెండోదశ యుద్ధం మొదలైందన్న ఇరు దేశాల ఉన్నతాధికారులు
కీవ్, ఏప్రిల్ 19: ఉక్రెయిన్ రాజధాని కీవ్‌ను ఆక్రమించుకోవడంలో విఫలమైన రష్యా తాజాగా తూర్పు ప్రాంతాలపై దృష్టిసారించింది. ఈ క్రమంలో పారిశ్రామిక ప్రాంతమైన డాన్బాస్ ఆక్రమణకు పుతిన్ సేనలు కదిలాయి. డాన్బాస్ శివారు ప్రాంతాలపై ఇప్పటికే రష్యా క్షిపణి దాడులకు పాల్పడినట్టు ఉక్రెయిన్ రక్షణశాఖ పేర్కొంది. ఇదే సమయంలో తమ ప్రాంతాలను కాపాడుకొనేందుకు రెండోదశ యుద్ధాన్ని ప్రారంభిస్తున్నట్టు వెల్లడించింది. ఎంతమంది రష్యా సైనికులు వచ్చినా తమ దేశాన్ని రక్షించుకొంటామని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ పునరుద్ఘాటించారు.
మరోదశ ఆపరేషన్ మొదలైనట్టు రష్యా విదేశాంగమంత్రి లావ్రోవ్ కూడా వెల్లడించారు. దాడులను మరింత ఉద్ధృతం చేయనున్నట్టు పేర్కొన్నారు. ఇదిలాఉండగా.. మరియుపోల్‌లో ప్రతిఘటన ఆపకపోతే భారీ స్థాయిలో నష్టాన్ని చవి చూడాల్సి వస్తుందని ఉక్రెయిన్ సేనలను రష్యా హెచ్చరించింది. వెంటనే ఆయుధాలు విడిచిపెట్టాలని అల్టిమేటం జారీ చేసింది. క్రెమిన్నా నగరాన్ని స్వాధీనం చేసుకొన్నట్టు ప్రకటించింది. తూర్పు, దక్షిణ ఉక్రెయిన్‌లోని 16 ఆర్మీ గిడ్డంగులను సోమవారం రాత్రి ధ్వంసం చేసినట్టు వెల్లడించింది. ఉక్రెయిన్ బలగాలు ఉన్న 108 ప్రాంతాలపై బాంబుల వర్షం కురిపించినట్టు తెలిపింది. 315 మిలిటరీ స్థావరాలపై క్షిపణిల దాడి చేసినట్టు పేర్కొంది.
‘డాన్బాస్’ను లక్ష్యంగా చేసుకోవడానికి కారణాలు
1. విజయం అత్యవసరం
రెండు నెలలుగా పోరాడుతున్నా ఉక్రెయిన్‌లోని కీలక నగరాలపై రష్యా ఆధిపత్యాన్ని సాధించలేకపోతున్నది. అంతర్జాతీయంగా తన శక్తిసామర్థ్యాలు మసకబారుతాయన్న ఆందోళనలో పుతిన్ ఉన్నారు. దీంతో సులభంగా ఆక్రమించే ప్రాంతాలపై రష్యా దృష్టిసారించింది. ఇందులో భాగంగానే వేర్పాటువాదుల ప్రాబల్యం ఎక్కువగా ఉన్న డాన్‌బాస్‌ను లక్ష్యంగా చేసుకొన్నది.
2. భూమార్గం కోసం..
డాన్‌బాస్‌లో బొగ్గు గనులు, భారీ పరిశ్రమలు ఉన్నాయి. అలాగే, తన అధీనంలోని క్రిమియాకు భూమార్గంలో చేరుకోవడానికి మరియుపోల్ లేదా డాన్బాస్ గుండా వెళ్లాల్సి ఉంటుంది. మరియుపోల్‌పై పట్టుసాధించాలని యత్నించినా పుతిన్ సేనలకు సాధ్య పడట్లేదు. దీంతో డాన్‌బాస్‌ను లక్ష్యంగా చేసుకొన్నారు.
3. రాజకీయ పరపతి
రష్యా ఇటీవల స్వతంత్ర దేశాలుగా ప్రకటించిన లుహాన్స్క్, డోనెట్స్క్ ప్రాంతాలు.. డాన్‌బాస్‌లోనే ఉన్నాయి. ఇక్కడ రష్యన్ల జనాభా ఎక్కువ. దీంతో ఆ ప్రాంతాలు తమవేనని రష్యా వాదిస్తున్నది. డాన్‌బాస్‌ను ఆక్రమిస్తే స్వదేశంలో పౌరుల మనసుల్లో తన పరపతి పెరిగి రాజకీయంగా చరిత్రాత్మక గుర్తింపు లభిస్తుందని పుతిన్ భావిస్తున్నారు.