న్యూఢిల్లీ, ఏప్రిల్ 4: ఉక్రెయిన్‌తో నాలుగేండ్లుగా సాగుతున్న యుద్ధంలో 3.5 లక్షల మంది సైనికులను కోల్పోవడం రష్యాకు భారీ నష్టాన్ని మిగిల్చింది. దీంతో సైన్యం కోసం రహస్య నియామకాలకు రష్యన్ కంపెనీలు కేంద్రంగా మారాయి. కాంట్రాక్ట్ సైనిక సేవ కోసం అభ్యర్థుల జాబితాలను రూపొందించే ప్రక్రియలో 150 కంటే ఎక్కువ మంది ఉద్యోగులు ఉన్న సంస్థలను రష్యా అన్వేషించడం ప్రారంభించింది. ర్యాజాన్ ప్రాంతంలో ప్రైవేట్, ప్రభుత్వ యాజమాన్యంలోని కంపెనీలు ఉద్యోగులను నామినేట్ చేయాలని ఆదేశిస్తూ అక్కడి గవర్నర్ పావెల్ మల్కోవ్ ఒక ఉత్తర్వుపై సంతకం చేశారు.
ఈ ఉత్తర్వు ప్రకారం అవసరమైన అభ్యర్థుల సంఖ్య కంపెనీ పరిమాణంపై ఆధారపడి ఉంటుంది. 150 నుండి 300 మంది ఉద్యోగులు ఉన్న కంపెనీలు కనీసం ఇద్దరు అభ్యర్థులను, 300 నుండి 500 మంది ఉన్న కంపెనీలు ముగ్గురు అభ్యర్థులను, 500 కంటే ఎక్కువ మంది ఉద్యోగులు ఉన్న కంపెనీలు ఐదుగురు అభ్యర్థులను నామినేట్ చేయాలని ఆయన ఆదేశించారు.
వాస్తవానికి ఇది యజమానులపై ఒక కొత్త రకమైన ఒత్తిడిని సృష్టించనున్నది. దీనికి కారణం వారు కూడా ఇప్పుడు నియామక వ్యవస్థలో భాగం కావడం. ఇది అధికారిక ప్రకటన లేకుండా రహస్యంగా సమీకరణ జరిపేందుకు ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేస్తుంది. రష్యా అధికారికంగా మరో విడత సైన్య సమీకరణను ప్రకటించనప్పటికీ అధికారులు సైన్యాన్ని తిరిగి నింపడానికి ప్రత్యామ్నాయ పద్ధతులను ఉపయోగిస్తున్నారు. వీటిలో ఆర్థిక ప్రోత్సాహకాలు, ఖైదీలను నియమించుకోవడం, విదేశీ నియామకాలు, ఇప్పుడు వ్యాపార సంస్థల ద్వారా ఒత్తిడి తేవడం వంటివి ఉన్నాయి.
ఈ కొత్త విధానంతో స్వచ్ఛంద సేవకు క్రమంగా మంగళం పాడుతున్నట్లు అర్థమవుతున్నది. ఈ ఉత్తర్వులో తమ ఆదేశాలను పాటించని కంపెనీలపై విధించే శిక్షలను స్పష్టంగా పేర్కొనలేదు. కాని ప్రభుత్వ ఆదేశాలను అడ్డుకునే కంపెనీలకు ప్రస్తుత చట్టం ప్రకారం 10 లక్షల రూబుల్స్(12,300 డాలర్లు) వరకు జరిమానాలు విధించవచ్చు. ర్యాజాన్ ప్రాంత గవర్నర్ పావెల్ మల్కోవ్ సంతకం చేసిన ఈ ఆదేశం ప్రకారం యాజమాన్య స్వరూపంతో సంబంధం లేకుండా సంస్థలు సెప్టెంబర్ 20 లోగా నియామకాల కోటాలను నిర్ధారించాలని నిర్దేశిస్తున్నది.