రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రకటన
అజోవ్‌స్తల్ ప్లాంటులో చిక్కుకొన్న 2 వేల మంది ఉక్రెయిన్ సైనికులు
ఈగ కూడా బయటకు రావొద్దు: పుతిన్
కీవ్, ఏప్రిల్ 21: ఉక్రెయిన్ ఆక్రమణలో అత్యంత కీలక నగరమైన మరియుపోల్ రష్యా వశమైంది. యుద్ధం ప్రారంభించిన దాదాపు నెల రోజుల తర్వాత రష్యా అతి కష్టమ్మీద గురువారం ఈ నగరాన్ని చేజిక్కించుకొన్నది. ఈ విషయాన్ని రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రకటించారు. ‘నగరానికి స్వేచ్ఛ కల్పించడంలో విజయం సాధించాం’ అని వ్యాఖ్యానించారు. తమ సైనికులను అభినందించారు. మరియుపోల్‌లో ఉన్న అజోవ్‌స్తల్ స్టీల్ ప్లాంటులో 2వేల మందికి పైగా ఉక్రెయిన్ సైనికులు ఉన్నారు. ఈ ప్లాంటు ఇంకా పూర్తిగా రష్యా సైనికుల స్వాధీనంలోకి రాలేదు. ఈ నేపథ్యంలో ప్లాంటు లోపలికి వెళ్లి దాడులకు దిగవద్దని, ఫ్యాక్టరీని దిగ్బంధించాలని పుతిన్ తన సేనలకు సూచించారు. ‘ఫ్యాక్టరీ లోపలి నుంచి ఒక్క ఈగ కూడా బయటకు వెళ్లవద్దు’ అని ఆదేశించారు.
ఈ స్టీల్ ప్లాంట్ కేంద్రంగానే ఉక్రెయిన్ బలగాలు మరియుపోల్‌లో రష్యా బలగాలను ఎదుర్కొంటున్నాయి. స్టీల్ ప్లాంటులో తమ సైనికులతో పాటు వెయ్యి మందికి పైగా సాధారణ పౌరులు ఉన్నట్టు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ చెప్పారు. వందలాది మంది గాయాలతో ఉన్నారని పేర్కొన్నారు. వారికి మానవతా సాయం అందించడానికి అనుమతించాలని కోరారు. మరియుపోల్ నుంచి పౌరుల తరలింపు గురువారం సాధ్యం కాలేదని ఉక్రెయిన్ ప్రభుత్వం వెల్లడించింది. అజోవ్‌స్తల్ స్టీల్ ప్లాంటులో ఉన్న సొరంగాల్లోనే ఉక్రెయిన్ సైనికులు ఉన్నారు.
డాన్బాస్, క్రిమియా మధ్యలో మరియుపోల్
ఈ ఏడాది ఫిబ్రవరి 24వ తేదీన రష్యా ఉక్రెయిన్‌పై సైనిక చర్య ప్రకటించింది. అప్పటి నుంచి మరియుపోల్‌పై తీవ్ర దాడులు కొనసాగుతున్నాయి. వ్యూహాత్మకంగా ఇది చాలా కీలకమైన ప్రాంతం. రష్యా స్వతంత్ర ప్రాంతంగా గుర్తించిన డాన్‌బాస్‌కు, 2014లో పుతిన్ ఆక్రమించిన క్రిమియాకు మధ్యలో ఈ నగరం ఉంది. తాజా ఆక్రమణతో ఈ రెండు ప్రాంతాల మధ్య భూ మార్గంలో ఆయుధ రవాణా సులువవుతుంది. ఇదిలా ఉండగా, లుహాన్స్లో 80% భూభాగం రష్యా నియంత్రణలో ఉన్నదని ఆ ప్రాంత గవర్నర్ తెలిపారు. రష్యా దాడికి ముందు ఇక్కడ మెజారిటీ ప్రాంతం ఉక్రెయిన్ స్వాధీనంలో ఉంది.