కీవ్, ఏప్రిల్ 13: ఉక్రెయిన్‌తో జరుగుతున్న యుద్ధాన్ని ఆపాలంటూ అమెరికా తీసుకొస్తున్న ఒత్తిడి రష్యాపై ఏమాత్రమూ పనిచేయటం లేదు. ఉక్రెయిన్ నగరాలే లక్ష్యంగా భీకరమైన క్షిపణి దాడులతో రష్యా విరుచుకుపడుతున్నది. తాజాగా ఉక్రెయిన్ ఈశాన్య ప్రాంతంలోని సుమీ నగరంపై రెండు బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. రష్యా జరిపిన అత్యంత భయానక క్షిపణి దాడిలో 34 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారని, మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉన్నారని, మరో 117మంది గాయపడ్డారని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఆదివారం ‘ఎక్స్’ వేదికగా వెల్లడించారు.
‘ఒక సాధారణ నగరంపై రష్యా భయానకమైన క్షిపణిని ప్రయోగించింది. నివాస భవనాలు, విద్యా సంస్థలు, వీధుల్లోని కార్లు, నగరంలోని సాధారణ జీవితం అంతటినీ క్షిపణి దాడి దెబ్బతీసింది’ అని జెలెన్స్కీ చెప్పారు. రష్యా చర్యను ఖండిస్తూ అమెరికా, యూరప్ గట్టిగా స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు. రెండు రోజుల క్రితం రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను కలుసుకున్న అమెరికా రాయబారి స్టీవ్ విన్కాఫ్ కీలక అంశాలపై చర్చలు జరిపారు. అయినప్పటికీ ఉక్రెయిన్‌పై రష్యా భీకరమైన మిస్సైల్‌తో దాడికి దిగటం గమనార్హం. రష్యాపై ఒత్తిడి తీసుకురాకుండా, శాంతి ఏర్పడదని జెలెన్స్కీ అన్నారు.
ఉక్రెయిన్‌లోని కుసుంలో భారతీయ ఫార్మా కంపెనీకి చెందిన గిడ్డంగిపై రష్యా క్షిపణి దాడి చేసినట్టు ఉక్రెయిన్ శనివారం ఆరోపించింది. తమ దేశంలోని భారతీయ వ్యాపారాలపై రష్యా ఉద్దేశపూర్వకంగా దాడులు చేస్తున్నట్టు భారత్‌లోని ఉక్రెయిన్ ఎంబసీ ఎక్స్ వేదికగా ఆరోపించింది. భారత్‌తో ప్రత్యేక స్నేహం అని ఒక పక్క చెబుతూ మరోపక్క భారత వ్యాపారాలపై రష్యా ఉద్దేశపూర్వకంగా దాడులు చేస్తోందని ఎంబసీ పేర్కొంది.