కీవ్, నవంబర్ 16: ఉక్రెయిన్‌తో యుద్ధంలో రష్యా కొత్త ఎత్తుగడలు వేస్తున్నది. 22 నెలలుగా కొన‘సాగుతున్న’ యుద్ధం గేరు మార్చే వ్యూహాలు రచిస్తున్నది. ఉక్రెయిన్ బలగాలను ఏమార్చి టార్గెట్‌ను రీచ్ కావాలని ప్రయత్నిస్తున్నది. ఉక్రెయిన్ రాడార్లకు, యాంటీ మిసైల్ వ్యవస్థకు చిక్కకుండా ప్రమాదకర థెర్మోబేరిక్ బాంబు(వాక్యూమ్ బాంబు)లను వినియోగించేందుకు డెకాయ్ డ్రోన్లను వాడుకోనున్నట్టు తెలుస్తున్నది. ఇందుకోసం అలబుగా సెజ్‌లోని ఓ కర్మాగారంలో పెద్ద ఎత్తున డెకాయ్ డ్రోన్లను తయారుచేస్తున్నట్టు అసోసియేటెడ్ ప్రెస్(ఏపీ) గుర్తించింది. ఒక రకంగా చెప్పాలంటే డెకాయ్ డ్రోన్లు.. బొమ్మ డ్రోన్ల లాంటివి. బాంబులను మోసుకొస్తున్నట్టుగా వీటిని తయారుచేసి ఉక్రెయిన్‌పైకి రష్యా పంపిస్తున్నట్టు ఏపీ కథనం పేర్కొన్నది.
ఈ కర్మాగారంలో వందలాది డెకాయ్ డ్రోన్లతో పాటు థెర్మోబేరిక్ డ్రోన్లను బయటకు తీస్తున్నారని ఏపీ కథనం వెల్లడించింది. థెర్మోబేరిక్ బాంబులను వాక్యూమ్ బాంబు అంటారు. ఆక్సీజన్, ఇంధనాన్ని వినియోగించి ఇది భారీ పేలుడు సృష్టిస్తుంది. ఇది పేలినప్పుడు ఒక భారీ మేఘం ఏర్పడి, దాని పరిధిలో పెను విధ్వంసం జరుగుతుంది. అణుయేతర బాంబులన్నింటిలో ప్రమాదకరమైన బాంబుగా దీనిని భావిస్తారు. థెర్మోబేరిక్ డ్రోన్లతో పాటు పెద్ద ఎత్తున డెకాయ్ డ్రోన్లను ప్రయోగించి రాడార్లను గందరగోళపర్చడం, డెకాయ్ డ్రోన్లకు లైవ్ ఫీడ్ కెమెరాలను ఏర్పాటు చేసి ఉక్రెయిన్ యాంటీ మిస్సైల్ వ్యవస్థను గుర్తించి దాడి చేయడం రష్యా లక్ష్యాలని తెలుస్తున్నది.