కీవ్, ఏప్రిల్ 28: నల్ల సముద్రంలో ఉక్రెయిన్ సరిహద్దుల్లో ఉన్న తమ సెవాస్తొపోల్ నౌకాశ్రయాన్ని కాపాడుకోవడానికి రష్యా మిలిటరీ డాల్ఫిన్లను రంగంలోకి దించింది. శిక్షణ పొందిన రెండు డాల్ఫిన్లు ఈ నౌకాశ్రయం దగ్గర నీటిలో తిరుగుతూ రష్యా యుద్ధ నౌకలను కాపలా కాస్తున్నాయి. ఉక్రెయిన్‌పై సైనిక చర్యను ప్రకటించిన ఫిబ్రవరిలోనే రష్యా ముందు జాగ్రత్తగా ఈ డాల్ఫిన్లను నల్ల సముద్రంలోకి తరలించింది. ఉపగ్రహ చిత్రాలతో తాజాగా ఈ విషయం వెల్లడైనట్టు అమెరికా నౌకాదళ సంస్థ(యూఎన్ఎస్ఐ) తెలిపింది. నల్ల సముద్రంలో రష్యాకు అత్యంత కీలకమైన నౌకాదళ స్థావరం ఇదే. ఇది ఉక్రెయిన్ క్షిపణుల పరిధికి దూరంగా ఉన్నప్పటికీ సముద్ర గర్భం నుంచి ఇక్కడ దాడులకు పాల్పడే అవకాశం ఉంది. దీన్ని తిప్పికొట్టడానికే రష్యా డాల్ఫిన్లను కాపలా పెట్టింది. రష్యానే కాదు అమెరికా కూడా చాలా కాలంగా డాల్ఫిన్లకు మిలిటరీ శిక్షణ ఇస్తున్నది.
ఐరాస సెక్రెటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ గురువారం ఉక్రెయిన్ రాజధాని కీవ్ నగరం వెలుపల పర్యటించారు. సామూహిక హత్యలు జరిగిన ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. అంతర్జాతీయ నేర న్యాయస్థానానికి రష్యా సహకరించాలని కోరారు. యుద్ధం ఏదైనా మూల్యం చెల్లించేది సాధారణ ప్రజలేనని ఆవేదన చెందారు. ఫిన్లాండ్, స్వీడన్ దేశాలు సాధ్యమైనంత త్వరగా నాటోలో చేరాలని కూటమి చీఫ్ జెన్స్ స్టోల్టెన్‌బర్గ్ అన్నారు. తూర్పు ఉక్రెయిన్‌పై దాడులను రష్యా తీవ్రతరం చేసిందని ఉక్రెయిన్ అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా, మార్చి మొదటివారంలోనే చేజిక్కించుకొన్న ఖేర్సన్ నగరంలో రష్యా నకిలీ రెఫరెండం నిర్వహిస్తుందని స్థానికులు భావిస్తున్నారు. ఈ రెఫరెండం పేరుతో ఖేర్సన్ను తమ భూభాగంలో కలిపేసుకొంటుందని భయపడుతున్నారు.