Russia Marshal Law | సరిగ్గా వారం క్రితం చెప్పినట్లుగానే ఉక్రెయిన్లో ఆక్రమించుకున్న ప్రాంతాల్లో రష్యా మార్షల్ లా అమలు చేస్తున్నది. ఇవాల్టి నుంచి లా ఎన్ఫోర్స్మెంట్ అధికారులు రష్యా ఆక్రమిత నగరాల్లో తనిఖీలను ముమ్మరం చేశారు. తొలుత జాపోరిజ్జియాలో మార్షల్ లాను అమల్లోకి తెచ్చారు.
మార్షల్ లా డిక్రీ ప్రకారం సైనిక సెన్సార్షిప్ను అమలు చేస్తున్నట్లు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించారు. ఉక్రెయిన్ ఆక్రమిత ప్రాంతం జాపోరిజ్జియాలో రష్యా అధికారులు స్థానికుల ఫోన్లను తనిఖీ చేపట్టారు. ఇవాల్టి నుంచి జాపోరిజ్జియా ప్రాంతంలో మార్షల్ లాను అమలు చేసే అధికారులు ఇక్కడి పౌరుల మొబైల్ ఫోన్లను తనీఖీ చేపడతారని మాస్కో నియమించిన అధికారి వ్లాదిమిర్ రోగోవ్ చెప్పారు. ఎవరైనా విదేశీ ఏజెంట్లు ప్రచారం చేస్తున్నట్లు తేలితే క్రిమినల్ ప్రాసిక్యూషన్కు లోబడి చర్యలుంటాయని రోగోవ్ పేర్కొన్నారు. మరో మూడు నగరాల్లో కూడా మార్షల్ లా కింద తనిఖీలకు రష్యా అధ్యక్షుడు పుతిన్ అనుమతించారని వెల్లడించారు.