కీవ్: ఉక్రెయిన్‌లోని సోలెడార్ పట్టణాన్ని కైవసం చేసుకున్నట్లు రష్యా రక్షణ శాఖ ప్రకటించింది. ఉక్రెయిన్‌తో చేస్తున్న యుద్ధంలో వరుస ఎదురుదెబ్బల తర్వాత రష్యాకు ఇది ఊరట కలిగించే విషయం. సోలెడార్‌ను స్వాధీనం చేసుకోవడం ద్వారా డోనెట్స్ నగరంలోని ఉక్రెయిన్ బలగాలకు సరఫరాలను అడ్డుకోగలమని, ఉక్రెయిన్ బలగాలను చుట్టుముట్టగలమని రష్యా రక్షణ శాఖ అధికార ప్రతినిధి జనరల్ ఇగోర్ కొనాషెన్‌కోవ్ పేర్కొన్నారు. కాగా, సోలెడార్‌ను స్వాధీనం చేసుకోవడం వల్ల రష్యాకు అది ఊహిస్తున్నంత ప్రయోజనం ఏమీ ఉండదని అమెరికా కేంద్రంగా పని చేసే ఇన్స్టిట్యూట్ ఫర్ ది స్టడీ ఆఫ్ వార్ సంస్థ అభిప్రాయపడింది.
సోలెడార్‌ను కైవసం చేసుకున్నట్లు రష్యా చేసిన ప్రకటనను ఉక్రెయిన్ ఖండించింది. అక్కడ ఇంకా పోరాటం కొనసాగుతున్నదని ఉక్రెయిన్ ఆర్మీ అధికార ప్రతినిధి సెర్హి చెరెవటి ప్రకటించారు. ఉక్రెయిన్ తూర్పు ప్రాంతాలను గెలుచుకునేందుకు రష్యా తన అన్ని ప్రధాన బలగాలను పంపిందని, అయినా తమ బలగాలు వీరోచితంగా పోరాడుతున్నాయని ఉక్రెయిన్ ప్రభుత్వం తెలిపింది.
నాటోలో చేరినట్టే..
నాటో సభ్యదేశంగా ఉక్రెయిన్ దాదాపు చేరినట్టేనని ఆ దేశ రక్షణ మంత్రి ఒలెక్సీ రెజ్నికోవ్ పేర్కొన్నారు. పాశ్చాత్య దేశాలు ఉక్రెయిన్‌కు యుద్ధ ట్యాంకులు, ఫైటర్ జెట్లు వంటి భారీ ఆయుధాలు సరఫరా చేయడంలో ఇక అవరోధాలు ఉండవని ఆయన తెలిపారు.