మాస్కో: ఉక్రెయిన్ విస్తృత స్థాయిలో రష్యాపై డ్రోన్ దాడి చేసింది. సుమారు 600 డ్రోన్లతో అటాక్ చేసినట్లు రష్యా రక్షణ శాఖ పేర్కొన్నది. అయితే తమ వైమానిక రక్షణ దళం ఆ డ్రోన్లను కూల్చివేసినట్లు మాస్కోలోని రష్యా రక్షణ శాఖ పేర్కొన్నది. సుమారు 20 ప్రాంతాల్లో ఎలక్ట్రానిక్ పద్ధతుల్లో ఆ డ్రోన్లను నేలకూల్చినట్లు రష్యా వెల్లడించింది. మాస్కో, లెనిన్గ్రాడ్, క్రస్నోడార్, బెల్గోరోడ్, సమరా, వోల్గోగ్రాడ్ , క్రిమియా, అజోవ్ సముద్రంపై ఆ అటాక్ జరిగింది. మాస్కో మీదకు వచ్చిన సుమారు 11 యూఏవీలను కూల్చివేసినట్లు ఆ నగర మేయర్ సెర్గీ సోబియానియన్ తెలిపారు.
డ్రోన్ల దాడి వల్ల క్రిమియాలో బ్లాకౌట్ ఏర్పడింది. స్థానిక ఎలక్ట్రిక్ గ్రిడ్ ఆపరేటర్ దెబ్బతిన్నది. హై వోల్టేజ్ నెట్‌వర్క్‌ను టార్గెట్ చేయడం వల్ల అన్ని నగరాలు, జిల్లాలో విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. సుదీర్ఘ దూరం ప్రయాణించే యూఏవీలతో ఇంధన కేంద్రాలను కీవ్ టార్గెట్ చేసినట్లు రష్యా చెప్పింది. ఉక్రెయిన్ డ్రోన్ దాడి వల్ల.. సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో ఉన్న పోర్టు దెబ్బతిన్నది. అక్కడున్న ఆయిల్ కంపెనీ నుంచి నల్లటి పొగ వ్యాపిస్తున్నది. సమీపంలో ఉన్న మిలిటరీ టార్గెట్లను కూడా ధ్వంసం చేసినట్లు ఉక్రెయిన్ చెప్పింది.
రాజధాని మాస్కోపైనే సుమారు 200 డ్రోన్లతో దాడి జరిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు. రష్యాలో చాలా సుదూర ప్రాంతాల్లో ఉన్న ఆయిల్ కంపెనీ కేంద్రాలపై కూడా ఉక్రెయిన్ దాడి చేయడం గమనార్హం. ఉక్రెయిన్ తాజా డ్రోన్ దాడులతో.. రష్యాలో కొత్త తరహా యుద్ధం మొదలైంది. మీడియం రేంజ్ డ్రోన్లతో రష్యా లాజిస్టిక్స్‌ను ఉక్రెయిన్ క్రమంగా టార్గెట్ చేస్తోంది. క్రిమియాలో ఇంధన కొరత ఏర్పడడంతో ఎమర్జెన్సీ ప్రకటించారు.