కీవ్: ఉక్రెయిన్‌లో విద్యుత్తు ఉత్పత్తి కేంద్రాలే లక్ష్యంగా రష్యా భీకరమైన బాంబు దాడులకు దిగింది. ఆదివారం రాజధాని కీవ్ సహా దేశంలోని పలు చోట్ల ఉన్న మౌలిక వసతుల కేంద్రాలను రష్యా మిలటరీ టార్గెట్ చేసింది. కీవ్, ఒడిస్సీ, సెంట్రల్ ఉక్రెయిన్ల్లోని వివిధ ప్రాంతాలపై వందల కొద్దీ మిస్సైల్స్, డ్రోన్లతో పెద్ద ఎత్తున బాంబు దాడులను చేపట్టింది. ఉక్రెయిన్ మౌలిక వసతులను ధ్వంసం చేయటం, సామాన్యులను చంపటమే రష్యా లక్ష్యంగా పెట్టుకుందని జెలెన్స్కీ ఆరోపించారు. 120కిపైగా మిస్సైల్స్, 90 డ్రోన్లను ప్రయోగించినట్టు తెలిపారు. ఉక్రెయిన్ నగరం మైకోలైవ్లోని థర్మల్ పవర్ ప్లాంట్ ధ్వంసమైందని, డ్రోన్ దాడిలో ఇద్దరు చనిపోగా, ఇద్దరు చిన్నారులు సహా మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారని జెలెన్స్కీ చెప్పారు. రష్యా క్షిపణి, డ్రోన్ దాడుల్లో.. 140 వరకు తమ మిస్సైల్ రక్షణ వ్యవస్థ అడ్డుకుందని వివరించారు. డ్రోన్లు, మిస్సైల్స్‌ను రష్యా ఏకకాలంలో ప్రయోగించిందని, గత మూడు నెలల్లో రష్యా చేపట్టిన భీకరమైన బాంబు దాడులుగా కీవ్ సిటీ మిలటరీ వర్గాలు పేర్కొన్నాయి. రాబోయే శీతాకాలంలో ఉక్రెయిన్ విద్యుత్తు ఉత్పత్తి సామర్థ్యాన్ని దెబ్బతీయటమే లక్ష్యంగా రష్యా బాంబుదాడులు చేపడుతున్నట్టు ఉక్రెయిన్ అధికార వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.