Mariupol theatre Demolition | ఆక్రమించుకున్న ఉక్రేనియన్ నగరం మరియాపోల్‌లో డ్రామా థియేటర్ కూల్చివేత పనులను శుక్రవారం రష్యా ప్రారంభించింది. ఉక్రెయిన్‌పై గత మార్చి నెలలో జరిపిన బాంబు దాడుల్లో ఈ థియేటర్లో చాలా భాగం ధ్వంసమైంది. ఈ బాంబు దాడిలో వందలాది మంది మరణించారని ఉక్రెయిన్ ఆరోపిస్తున్నది. డ్రామా థియేటర్ కూల్చివేతకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను రష్యన్ వెబ్సైట్లలో ప్రచురితమయ్యాయి. ఈ ఫొటోల్లో భవనం ముందు భాగం అలాగే ఉంచి పై భాగాన్ని కూల్చివేస్తున్నట్లు కనిపిస్తున్నది.
గత మార్చి 16న జరిపిన బాంబు దాడిలో మరణాలను కప్పిపుచ్చడంతోపాటు తమ దేశ సంస్కృతిని తుడిచిపెట్టే ప్రయత్నంగా రష్యా ఈ భవనం కూల్చివేతను ప్రారంభించినట్లు ఉక్రేనియన్ అధికారులు చెప్తున్నారు. తమ ఆధీనంలో ఉన్న నగరంలో థియేటర్‌ను పునర్నిర్మించే ప్రణాళికల్లో భాగంగా కొంత భాగాన్ని కూల్చివేస్తున్నట్లు మరోవైపు రష్యా అధికారులు తెలిపారు. ఈ భవనాన్ని పునఃనిర్మించడం సాధ్యం కాకపోవడం వల్ల బాగా దెబ్బతిన్న ప్రాంతాన్ని తొలగించి అక్కడ కొత్త నిర్మాణాలు చేపట్టేలా ప్లాన్ చేసినట్లు థియేటర్ డైరెక్టర్ ఇగోర్ సోలోనిన్ చెప్పారు. 2024 చివరికల్లా ఈ థియేటర్‌ను తిరిగి అందుబాటులోకి తీసుకొచ్చేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు.
బాంబు దాడుల సమయంలో మరియాపోల్ వాసులు పెద్ద సంఖ్యలో ఈ థియేటర్లో తలదాచుకున్నారు. ఈ థియేటర్‌పై బాంబు దాడి చేయడంతో కనీసం 300 మంది మరణించారని ఉక్రెయిన్ అధికారులు చెప్తున్నారు. అయితే, డ్రామా థియేటర్‌పై తామేమీ ఉద్దేశపూర్వకంగా బాంబు దాడులు చేయలేదని రష్యా చెప్తున్నది. కాగా, రష్యా దాడులను రెండు నెలలకు పైగా మరియాపోల్ ప్రజలు ఎదుర్కొన్నారు. ఇక్కడి అనేక భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయి.