Russia-Ukraine War | కీవ్: ఉక్రెయిన్ విద్యుత్తు ఉత్పత్తి, సరఫరా వ్యవస్థపై రష్యా గురువారం విరుచుకుపడింది. దాదాపు 200 క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేసింది. రెండు వారాల్లో ఇది రెండో భారీ దాడి. చలికాలం రావడానికి ముందే తమ విద్యుదుత్పత్తి వ్యవస్థను దెబ్బ తీయడానికి రష్యా ప్రయత్నిస్తున్నదనే ఆందోళన ఉక్రెయిన్‌లో వ్యక్తమవుతున్నది.
ఉక్రెయిన్‌లోని అన్ని ప్రాంతాల్లోని విద్యుత్తు ఉత్పత్తి ప్రాజెక్టులపై రష్యా దాడులు చేస్తున్నదని ఉక్రెయిన్ విద్యుత్తు శాఖ మంత్రి హెర్మన్ హలూషెంకో ఫేస్బుక్ పోస్ట్‌లో తెలిపారు. దేశవ్యాప్తంగా అత్యవసర విద్యుత్తు కోతలను అమలు చేస్తున్నట్లు చెప్పారు. సామాన్య ప్రజలు నివసించే ప్రాంతాలపైనా రష్యా దాడులు చేస్తున్నదని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఆరోపించారు.
ఒకేసారి పెద్ద మొత్తంలో చిన్న చిన్న బాంబులను కురిపిస్తుండటంతో సాధారణ పౌరులు భయాందోళనలకు గురవుతున్నారు. ప్రజలు తమ ఫోన్లు, ఇతర పరికరాలను ఛార్జింగ్ చేసుకోవడానికి ఏర్పాట్లు చేయాలని స్థానిక అధికారులను ఉక్రెయిన్ ఆదేశించింది. ప్రజల కోసం ప్రత్యేకంగా షెల్టర్లను ఏర్పాటు చేయాలని చెప్పింది.