కీవ్: ఉక్రెయిన్‌పై రష్యా మరోసారి భారీ దాడికి పాల్పడింది. రాజధాని కీవ్‌తో పాటు పలు ప్రాంతాలపై డజన్ల కొద్దీ క్రూయిజ్, బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్లతో దండెత్తింది. ఉక్రెయిన్ మౌలిక సదుపాయాలు, ముఖ్యంగా విద్యుత్తు వ్యవస్థ లక్ష్యంగా శుక్రవారం విరుచుకుపడింది. 93 క్రూయిజ్, బాలిస్టిక్ క్షిపణులు, 200 డ్రోన్లతో రష్యా దాడులు చేసిందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తెలిపారు.
రష్యా దురాక్రమణ ప్రారంభమైన మూడేండ్ల తర్వాత తమ దేశ విద్యుత్తు వ్యవస్థపై జరిపిన అతిపెద్ద దాడిగా ఆయన పేర్కొన్నారు. అయితే తమ రక్షణ వ్యవస్థలో ఉన్న ఎఫ్-16 విమానాల ద్వారా 11 క్రూయిజ్ సహా 81 క్షిపణులను నేలకూల్చినట్టు చెప్పారు. రష్యా దాడులపై ప్రపంచ దేశాలు తీవ్రంగా స్పందించాల్సిన అవసరం ఉందని, ఉగ్రవాదాన్ని ఆపడానికి ఇదొక్కటే మార్గమని అన్నారు.