మాస్కో: ఉక్రెయిన్‌తో పూర్తి స్థాయి కాల్పుల విమరణ ఒప్పందానికి రష్యా అధ్యక్షుడు పుతిన్ తిరస్కరించిన విషయం తెలిసిందే. కాల్పుల విమరణపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మంగళవారం పుతిన్‌తో మాట్లాడారు. ఆ ఫోన్ కాల్ ద్వారా కొన్ని అంశాల్లో మాత్రమే క్లారిటీ వచ్చింది. కేవలం అణు విద్యుత్తు కేంద్రాలపై మాత్రమే దాడి చేయకుండా ఉండేందుకు పుతిన్ అంగీకరించినట్లు వైట్‌హౌజ్ వర్గాలు వెల్లడించాయి. 30 రోజుల కాల్పుల విమరణ ఒప్పందం విఫలం కావడంతో.. రష్యా, ఉక్రెయిన్ దేశాలు మళ్లీ వైమానిక దాడుల(Air Attacks)కు దిగాయి. రెండు దేశాలు ప్రత్యర్థి కేంద్రాలపై అటాక్ చేశాయి.
ఉక్రెయిన్‌కు మిలిటరీ సహాయాన్ని నిలిపివేస్తేనే పూర్తి స్థాయి కాల్పుల విమరణకు అంగీకరిస్తానని పుతిన్ స్పష్టం చేశారు. ట్రంప్‌తో జరిగిన ఫోన్ సంభాషణలో ఆయన ఈ విషయాన్ని చెప్పారు. అయితే ఆ టాక్స్ విఫలం కావడంతో.. మళ్లీ ఏరియల్ అటాక్స్ చోటుచేసుకున్నాయి. రష్యా జరిపిన తాజా దాడి వల్ల పౌర మౌళిక సదుపాయాలకు నష్టం కలిగిందని, సుమీలోని ఆస్పత్రి డ్యామేజ్ అయినట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తెలిపారు.
ఉక్రెయిన్‌కు చెందిన 57 డ్రోన్లను కూల్చివేసినట్లు రష్యా రక్షణ దళం ఇవాళ పేర్కొన్నది. రష్యా ఆధీనంలోని క్రాస్నోడార్ ప్రాంతంలో ఉన్న ఓ ఆయిల్ డిపోపై ఉక్రెయిన్ డ్రోన్ దాడి చేయడంతో అగ్నిప్రమాదం జరిగింది. ఇక మరో వైపు ఇవాళ రెండు దేశాలు 175 మంది ఖైదీలను అప్పగించుకునేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ ఆదివారం మరోసారి అమెరికా నేతృత్వంలో రష్యా, ఉక్రెయిన్ సంక్షోభంపై శాంతి చర్చలు జరగనున్నాయి.