మెల్బోర్న్, సెప్టెంబర్ 16: సౌర వ్యవస్థలో అత్యంత అద్భుతమైన దృశ్యం శనిగ్రహం చుట్టూ కనిపించే రింగులు. బృహస్పతి, ఇంద్ర, వరుణ గ్రహాల చుట్టూ కూడా ఆ రింగులు ఉన్నాయి. అయితే అటువంటి వలయాలు ఒకప్పుడు భూమి చుట్టూ కూడా ఏర్పడి ఉండవచ్చని భావిస్తున్నారు. ఇందుకు తగిన సాక్ష్యాలు లభించినట్టు ఎర్త్ అండ్ ప్లానెటరీ సైన్స్ లెటర్స్‌లో గత వారం ప్రచురితమైన ఒక నివేదిక పేర్కొన్నది. 46.6 కోట్ల సంవత్సరాల క్రితం ఏర్పడిన ఒక రింగు కొన్ని లక్షల సంవత్సరాలపాటు భూమి చుట్టూ ఉండేదని తెలిపింది. 46 కోట్ల సంవత్సరాలకు పూర్వం భారీ సంఖ్యలో ఉల్కలు భూమిని ఢీకొనేవని పేర్కొంది. భౌగోళికంగా కొద్ది కాలంలో ఏర్పడిన అనేక అగ్ని బిలాలను బట్టి ఇది తెలుస్తున్నదని ఆ పత్రం వివరించింది. అదే కాలంలో చైనా, రష్యా, యూరోప్ ప్రాంతాలలోని సున్నపురాయి నిక్షేపాలలో ప్రత్యేకమైన ఉల్క నుంచి పడిన వ్యర్థాలను కనుగొన్నామని పేర్కొంది. ఈ అవక్షేపణ శిలలలోని ఉల్క శకలాలు అంతరిక్షం నుంచి వెలువడే రేడియేషన్‌కు గురయ్యాయని తెలిపింది. భూమి చుట్టూ పలుచోట్ల కుప్పలుగా పడి ఉన్న అవక్షేపన శిలలను బట్టి ఆ సమయంలో భారీ సంఖ్యలో సునామీలు సంభవించినట్టు తెలుస్తున్నదని పేర్కొంది.