కీవ్ : రష్యాతో వాణిజ్య సంబంధాలు కొనసాగిస్తున్న భారత్‌తోసహా వాణిజ్య భాగస్వామ్య దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారీ సుంకాలు విధించడాన్ని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సమర్థించారు. సోమవారం అమెరికన్ ప్రసార సంస్థ ఏబీసీతో మాట్లాడుతూ ట్రంప్ చర్యను సరైన ఆలోచనగా ఆయన అభివర్ణించారు. రష్యా ఇంధన వాణిజ్యమే పుతిన్‌కి ఉక్రెయిన్‌పై ప్రయోగిస్తున్న ఆయుధమని ఆయన పేర్కొన్నారు. రష్యా నుంచి ఎగుమతులను అడ్డుకోవలసిందేనని ఆయన స్పష్టం చేశారు. చైనాలో రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో భారత ప్రధాని నరేంద్ర మోదీ జరిపిన చర్చల గురించి ప్రశ్నించినపుడు రష్యాతో వాణిజ్య ఒప్పందాలు కొనసాగిస్తున్న దేశాలపై సుంకాలు విధించాలన్న ఆలోచన సరైనదిగా తాను భావిస్తున్నట్లు జెలెన్స్కీ అన్నారు.
రష్యాతో ఇంధన వాణిజ్యాన్ని కొనసాగిస్తున్న తమ యూరోపియన్ మిత్రదేశాలపై కూడా జెలెన్స్కీ విమర్శలు గుప్పించారు. యూరోపియన్ల పట్ల ట్రంప్ వైఖరి సరైనదిగా తాను భావిస్తున్నట్లు ఆయన చెప్పారు. పుతిన్‌పై అదనపు ఒత్తిడి అవసరమని, అమెరికా నుంచి ఆ ఒత్తిడి అవసరమని ఆయన తెలిపారు. ఈయూ భాగస్వామ్య పక్షాలలో కొన్ని రష్యా నుంచి చమురు, గ్యాస్ కొనుగోలు కొనసాగిస్తున్నాయని, ఇది సమంజసం కాదని అన్నారు. రష్యా నుంచి ఎటువంటి ఇంధనాన్ని కొనుగోలు చేయరాదని ఆయన సూచించారు.