H-1B Visa | హెచ్-1బీ వీసా (H-1B Visa) విషయంలో ట్రంప్ తాజా నిర్ణయంతో టెక్ కంపెనీలు అప్రమత్తమయ్యాయి. మైక్రోసాఫ్ట్ (Microsoft), మెటా (Meta ) వంటి ప్రధాన ఐటీ సంస్థలు తమ ఉద్యోగులకు కీలక అడ్వైజరీ జారీ చేశాయి. H-1B వీసాదారులందరూ (H-1B Visa Holders) కనీసం 14 రోజుల పాటూ అమెరికాను విడిచి వెళ్లొద్దని సూచించాయి.
ప్రస్తుతం అమెరికా వెలుపల ఉన్న ఉద్యోగులు 24 గంటల్లోపు తిరిగి యూఎస్‌కు రావాలని ఆదేశించాయి. అమెరికాలో తమ భవిష్యత్తు కోసం విదేశీ ఉద్యోగులు ఈ ఆదేశాలను పాటించాలని కోరాయి. ఈ మేరకు ఉద్యోగులకు ఆయా సంస్థలు అంతర్గత మెయిల్స్ పంపినట్లు తెలిసింది. హెచ్-1బీ, హెచ్-4 వీసాదారులు 24 గంటల్లోపు అంటే సెప్టెంబర్ 21 లోపు ఆలస్యం చేయకుండా అమెరికాకు తిరిగి వచ్చేయాలని మెటా, మైక్రోసాఫ్ట్ సంస్థలు ఆదేశించాయి.
అమెరికా (America)లో ఉద్యోగం చేయాలనుకునే వారికి డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) భారీ షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. విదేశీ నిపుణుల నియామకానికి జారీ చేసే హెచ్-1బీ వీసా (H1B Visa Fee) దరఖాస్తులపై వార్షిక రుసుంను లక్ష డాలర్లకు పెంచారు. ఈ మేరకు కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకం చేశారు. ఈ నిర్ణయంతో అమెరికా వేదికగా పనిచేస్తున్న కంపెనీలు విదేశీ నిపుణులను నియమించుకునేందుకు జారీ చేసే ఒక్కొక్క వీసాపై ఇకపై ఏడాదికి లక్ష డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. చెల్లింపులకు కంపెనీలు సిద్ధంగా లేనట్లయితే వర్క్ వీసాపై వెళ్లేవారు ఇంటి ముఖం పట్టాల్సిందే. దీని ప్రభావం భారతీయ వృత్తి నిపుణులు, నైపుణ్యం కలిగిన చైనా కార్మికులపై ఆధారపడే టెక్ రంగంపై అధికంగా ఉండనుంది. అదేవిధంగా అగ్రరాజ్యంలో మాస్టర్స్ ప్రోగ్రామ్ చేయాలనుకునే భారతీయుల ఆశలు ఆవిరయ్యే ప్రమాదం ఉన్నది.
అమెరికాలో కార్యకలాపాలు సాగిస్తున్న పలు టెక్ కంపెనీలకు ట్రంప్ నిర్ణయం పెద్ద దెబ్బే అని చెప్పాలి. ఎందుకంటే.. భారత్‌కు చెందిన పలు దిగ్గజ సంస్థలు ఎక్కువగా హెచ్-1బీ వీసాలతోనే అమెరికాలో తమ వ్యాపార కార్యకలాపాలు సాగిస్తున్నాయి. ఈ వీసాలతోనే భారతీయుల్ని నియమించుకుంటున్నాయి. ఇందులో అమెజాన్ (Amazon) సంస్థ టాప్‌లో ఉంది. ఆ తర్వాత టాటా కన్సల్టెన్సీ (TCS) రెండోస్థానంలో నిలిచింది.
యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ డేటా ప్రకారం.. 2024-25 ఆర్థిక సంవత్సరం జూన్ నాటికి అమెజాన్ దాదాపు 10,044 హెచ్-1బీ వీసాలను ఉపయోగించింది. ఆ తర్వాత టీసీఎస్ 5,505, మైక్రోసాఫ్ట్ (5,189), మెటా (5,123), యాపిల్ (4,202), గూగుల్ (4,181), డెలాయిట్ (2,353), ఇన్ఫోసిస్ (2,004), విప్రో (1,523), టెక్ మహీంద్రా అమెరికాస్ (951), ఒరాకిల్ (2,092), అమెజాన్ వెబ్ సర్వీసెస్ (2,347), కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్ (2,493), వాల్‌మార్ట్ అసోసియేట్స్ (2,390) హెచ్-1బీ వీసాలను దక్కించుకున్నాయి. ఇవే కాకుండా అమెరికాకు చెందిన పలు కంపెనీలు కూడా హెచ్-1బీ వీసాలతో ఎక్కువమంది భారతీయులను నియమించుకుంటున్నాయి. వాటిపై కూడా తీవ్ర ప్రభావం పడనుంది.
Also Read..
H1-B Visa Fee | అమెజాన్ టు టీసీఎస్.. హెచ్-1బీ వీసాలు ఏ కంపెనీలకు ఎన్నంటే..?
Donald Trump | మాకు గొప్ప కార్మికులు అవసరం.. హెచ్-1బీ వీసా వార్షిక రుసుంపై ట్రంప్
H1B Visa Fee | హెచ్-1బీ వీసా దరఖాస్తులపై రుసుమును భారీగా పెంచిన ట్రంప్..