రెస్టారెంట్లకు వచ్చే వాళ్లలో చాలామంది మర్యాదగానే ప్రవర్తిస్తారు. కానీ కొంతమంది ఒక్కోసారి హద్దు మీరుతుంటారు. అందుకే తన రెస్టారెంట్‌కు వచ్చే వాళ్లంతా సిబ్బందితో కూడా మర్యాదగా ప్రవర్తించేలా చేయాలని అనుకున్నాడో యజమాని. దానికో ఐడియా వేశాడు. ఇప్పుడిది నెట్టింట తెగ వైరల్ అవుతోంది. యూకేలోని ప్రీస్టన్‌లో ‘చాయ్ షాప్’ అనే రెస్టారెంట్‌ను ఈ ఏడాది మార్చి నెలలో ఉస్మాన్ హుస్సేన్ (29) అనే వ్యక్తి ప్రారంభించాడు. దీనిలో టీ, డోనట్లు, స్ట్రీట్ ఫుడ్స్, డిసర్టులు దొరుకుతాయి.
అయితే ఒక నుంచి ఇక్కడకు వచ్చే కస్టమర్ల ప్రవర్తన ఆధారంగా బిల్లు ఉంటుందని అతను చెప్పాడు. ఇదే విషయాన్ని చెప్తూ ఫేస్బుక్లో ఒక పోస్టు కూడా చేశాడు. రెస్టారెంట్ బయట ఉండే బోర్డుపై కూడా ఇదే విషయాన్ని రాశాడు. ఇంతకీ అతను ఏం రాశాడో తెలుసా? టీ తాగాలని అనుకునే వాళ్లు.. ‘దేశీ చాయ్’ అని అడిగితే 5 యూరోలు (రూ.400) చెల్లించాల్సి ఉంటుందట. అదే ‘దేశీ చాయ్ ప్లీజ్’ అనడిగితే కేవలం 3 యూరోలకే (రూ.240) ఇచ్చేస్తాడట.
ఇంకో అడుగు ముందుకేసి ‘హలో.. దేశీ చాయ్ ప్లీజ్’ అని ఆర్డర్ ఇస్తే టీ రేటు 1.9 యూరోలే (రూ.152) చార్జ్ చేస్తాడట ఉస్మాన్. దీని గురించి అతను మాట్లాడుతూ.. ఇప్పటి వరకు తన రెస్టారెంట్లో అమర్యాదగా ప్రవర్తించే కస్టమర్లు రాలేదని, అయితే తన కస్టమర్లంతా సరదాగా అందరితో కలిసిపోవాలనే ఉద్దేశ్యంతోనే ఈ ఆలోచన తీసుకొచ్చానని చెప్పాడు. కొన్నేళ్ల క్రితం అమెరికాలో ఒక రెస్టారెంటు ఇదే పని చేసిందని, అప్పటి నుంచి తన మనసులో ఈ ఆలోచన ఉందని వివరించాడు. ఏదేమైనా ఇప్పుడు ఉస్మాన్ చేసిన పని నెట్టింట వైరల్ అవుతోంది. దీన్ని చూసిన నెటిజన్లు సూపర్ ఐడియా అంటూ తెగ మెచ్చుకుంటున్నారు.