Bionic Eye | మెల్బోర్న్, సెప్టెంబర్ 29: అంధులకు తిరిగి చూపు తెప్పించడంలో పరిశోధకులు కీలక ముందడుగు వేశారు. ఆస్ట్రేలియాలోని మోనష్ విశ్వవిద్యాలయ పరిశోధకులు ప్రపంచంలోనే మొదటి ‘బయానిక్ ఐ’ని అభివృద్ధి చేశారు. ‘గెన్నరిస్ బయానిక్ విజన్ సిస్టమ్’గా పిలుస్తున్న ఈ సాంకేతికత జంతువుల్లో విజయవంతమైంది. మనుషుల్లో విజయవంతమైతే చూపును కోల్పోయిన కోట్లాది మంది తిరిగి తమ దృష్టిని పొందవచ్చు. చికిత్స లేని అంధత్వానికి పరిష్కారం చూపడంలో ఈ సాంకేతికత విప్లవాత్మకంగా మారనుంది.
దశాబ్ద కాలంగా ఈ సాంకేతికతపై పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ అధునాతన వ్యవస్థ సాధారణంగా కంటి నుంచి మెదడుకు దృష్టి సమాచారాన్ని చెరవేసే నేత్ర నాడులను దాటి వెళ్లడం ద్వారా పని చేస్తుంది. ఇది నేరుగా మెదడులోని దృష్టి కేంద్రానికి సంకేతాలను పంపుతుంది. దీని వల్ల వినియోగదారుడు దృశ్యాలను చూడటానికి వీలవుతుంది. గొర్రెల్లో ఈ సాంకేతికతను ఉపయోగించినప్పుడు తక్కువ ప్రతికూల ఫలితాలు వచ్చాయి. ఇప్పుడు మెల్బోర్న్లో ఈ సాంకేతికతను మనుషులపై ప్రయోగిస్తున్నారు.
వైర్లెస్ ట్రాన్స్మిటర్, కెమెరాతో కూడిన హెడ్‌గేర్(తలపై ధరించే పరికరం)ను రోగులు ధరించాలి. ఈ మొత్తం సిస్టమ్‌లో చిన్న 9 ఎంఎం ఇంప్లాంట్స్ ఉంటాయి. విజువల్ డాటాను రిసీవ్ చేసుకుని, విశ్లేషించేందుకు వీటిని మెదడులో అమర్చుతారు. ఈ సాంకేతికత ద్వారా చూపును తిరిగి తెప్పించడంతో పాటు నరాల సమస్యలకు పరిష్కారాలు కనుక్కోవాలని పరిశోధకులు ప్రయత్నిస్తున్నారు. మనిషి కన్ను అందించే 130 డిగ్రీల దృష్టి పరిధి కంటే కాస్త తక్కువగా ఈ కృత్రిమ కన్ను 100 డిగ్రీల వరకు దృష్టి పరిధిని అందిస్తుంది.