Russia | మాస్కో: కొవిడ్ లక్షణాలున్న ఓ మిస్టరీ వైరస్ రష్యాలో కలకలం రేపుతున్నది! దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో శ్వాసకోశ సమస్యలు, దగ్గుతున్నప్పుడు నోటి నుంచి రక్తం కారుతూ పలువురు రోగులు తీవ్ర అస్వస్థతకు గురవుతున్నట్టు ఆ దేశ మీడియాలో వార్తా కథనాలు వెలువడ్డాయి. తీవ్రమైన దగ్గు, జ్వరం, ఒళ్లు నొప్పులతో రోగులు అవస్థపడుతున్నారంటూ కథనాలు పేర్కొన్నాయి. రోగులకు కొవిడ్ టెస్టులు జరపగా.. అందులో నెగెటివ్ రాగా.. దేశంలో మిస్టరీ వైరస్ ఏదో వ్యాపించిందన్న అనుమానాలు బలపడుతున్నాయి.
కండరాల బలహీనత, తీవ్ర జ్వరం, దగ్గు.. మొదలైన కొవిడ్ తరహా లక్షణాలతో పలువురు అనారోగ్యం బారినపడటం ఆ దేశ పౌరుల్ని భయాందోళనకు గురిచేస్తున్నది. దీనిపై స్పందించిన రష్యా ప్రభుత్వ వైద్య అధికారులు, మిస్టరీ వైరస్ వార్తల్ని కొట్టివేశారు. కొత్త వ్యాధి కారకాలను గుర్తించలేదని, వెలుగులోకి వస్తున్న శ్వాసకోశ సమస్యలన్నీ సాధారణమైనవేనని స్పష్టం చేశారు. ఫ్లూ లక్షణాలను కలిగిన బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లతోనే పలువురు అనారోగ్యం పాలవుతున్నారని తెలిపారు. కాగా, కొవిడ్ నాటి అనుభవాల దృష్ట్యా వైద్య అధికారుల ప్రకటనలను రష్యా పౌరులు నమ్మటం లేదు.