న్యూఢిల్లీ, అక్టోబర్ 5: ప్రస్తుత జాబ్ మార్కెట్లో కొత్త ఉద్యోగం పొందడం అంత సులభమేమీ కాదు. అది సాఫ్ట్వేర్ అయినా, మార్కెటింగ్ అయినా, మేనేజ్మెంట్ అయి నా ఏ రంగంలోనైనా విపరీతమైన పోటీ ఉంది. ఎంతో కష్టపడి ఇంటర్వ్యూ టెస్ట్ కోసం సిద్ధమైనా, అందులో చేసిన చిన్నపాటి తప్పు కు పరీక్ష రాసిన 8 నిముషాల్లోనే తనను ఒక కంపెనీ ఎలా తిరస్కరించిందో, దాంతో తాను ఎలా విచారంలో, ఆవేదనలో మునిగిపోయానో రెడిట్‌లో ఒక భారతీయ టెకీ పెట్టిన పోస్ట్ వైరల్‌గా మారింది. ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగంతో విసిగిపోయి ఒక యూకే ఆధారిత స్టార్టప్‌లో ఉద్యోగానికి దరఖాస్తు చేశానని, వారు 2.15 గంటల పాటు నిర్వహించిన పరీక్షను రాశానని తెలిపాడు.
ఎంసీక్యూ, ఎస్క్యూఎల్లకు సరైన సమాధానాలు ఇచ్చినా నోడ్.జేఎస్ అసెస్మెంట్ సమయంలో విఫలమైనందున పరీక్ష రాసి పంపిన 8 నిమిషాలకే తనకు తిరస్కరణ ఈ-మెయిల్ వచ్చిందని, వారు తనను ఆ ఉద్యోగానికి తిరస్కరించారని, అది నిజంగా తనను చాలా బాధ పెట్టిందని, దాంతో ఏడ్చానని, జీవితం నాశనం అయినట్టు భావించానని అతడు తెలిపాడు. అలాంటి వాటికి చాలా మంది చాట్‌జీపీటీ సహాయంతో సమాధానాలు చెబుతారని ఒక వ్యక్తి తెలిపాడు. ‘ఇది మార్కెట్ బ్రో. ప్రస్తుతం కంపెనీలదే పైచేయి. వారు తక్కువ ఆఫర్లతో ఉత్తమ అభ్యర్థులను కోరుకుంటున్నారు. ప్రయత్నిస్తూ ఉండూ. చింతించకు’ అని మరో యూజర్ ఊరడించాడు.