న్యూఢిల్లీ, ఏప్రిల్ 3: ఇరాన్లో రెజీమ్ ఛేంజ్ (పాలన/ప్రభుత్వం మార్పు) అన్నది అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధ లక్ష్యాల్లో ప్రధానమైనది. ప్రస్తుతం పాలన మార్పు సాకారమవుతున్నది.. అయితే అది ఇరాన్లో కాదు.. అమెరికాలో. వాషింగ్టన్ డీసీలో ఇప్పుడు పదవులు వరుసగా ఊడిపోతున్నాయి. ఫిబ్రవరి 28న యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి అధ్యక్షుడు ట్రంప్‌కు అత్యంత సన్నిహిత సహాయకులు, క్యాబినెట్ సభ్యుల్లో చాలా మంది పదవులు పోయాయి. కొందరి పదవులు త్వరలోనే పోయే అవకాశం ఉంది. ఇరాన్ యుద్ధం, సమీపిస్తున్న 2026 నవంబర్ మధ్యంతర ఎన్నికల నేపథ్యంలో వైట్ హౌస్ ఒక భారీ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టింది. ఈ ఎన్నికల్లో అమెరికన్ కాంగ్రెస్‌పై పట్టు కోసం డెమోక్రాట్లు తీవ్ర పోరాటానికి దిగే అవకాశం ఉంది.
అయితే కేవలం పౌర అధికారుల పదవులే కాదు. రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ అమెరికా సాయుధ దళాల ఉన్నతాధికారులను లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఆర్మీ చీఫ్ ర్యాండీ జార్జ్‌పై వేటు వేశారు. ఇరాన్ యుద్ధానికి సంబంధించిన నిందను హెగ్సెత్‌పై నెట్టేందుకు ట్రంప్ ప్రయత్నించిన సంగతి తెలిసిందే. తన విధేయులను తొలగించడం ట్రంప్‌కు కొత్తేమీ కాదు. తన తొలి పదవీ కాలంలో ఆయన ముఖ్య వ్యూహకర్త స్టీవ్ బానన్, అటార్నీ జనరల్ జెఫ్ సెషన్స్‌తోపాటు మరికొందరిని తొలగించారు. ఇక రెండవ పదవీకాలంలో ఆయన తన విధేయులను కాపాడుకుంటానని గతంలో చేసిన వాగ్దానాన్ని ట్రంప్ పక్కనపెట్టినట్లు కనపడుతున్నది.
ది అట్లాంటిక్ పత్రిక కథనం ప్రకారం అధ్యక్షుడు ట్రంప్ తన రెండవ పదవీకాలాన్ని తన సన్నిహిత సహాయకులను, క్యాబినెట్ సభ్యులను తొలగించడానికి విముఖతతో ప్రారంభించారు. దీన్ని డెమోక్రాట్లకు, మీడియాకు లొంగిపోవడంగా ఆయన భావించారు. అయితే ఆ వైఖరి ఇప్పుడు మారింది. వలసల సమస్య నుంచి ఎప్స్టీన్ ఫైల్స్, ఇరాన్‌పై యుద్ధం వరకు దీనికి కారణాలు అనేకం ఉన్నాయి. ఇరాన్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ట్రంప్ ఆమోద రేటింగ్ తీవ్రంగా పడిపోయింది. అమెరికన్ ప్రజల్లో ఆయన నికర ఆమోదం మైనస్ 20-23 పాయింట్లకు పడిపోయిందని ఈ వారం ది ఎకనమిస్ట్ పత్రిక పేర్కొన్నది.
హోంల్యాండ్ సెక్యూరిటీ మంత్రి క్రిస్టీ నోమ్ తన కఠినమైన వలస విధానాల కారణంగా మొదటి బాధితురాలు అయ్యారు. ప్రధాన నగరాల్లోకి సాయుధ ఐసీఏ ఏజెంట్లను మోహరించి ప్రభుత్వ బహిష్కరణ ప్రచారానికి ముఖచిత్రంగా నోమ్ మారారు. మార్చి 5న ఆమె పదవి పోయింది. ట్రంప్ అనుచరుల్లో ఆ తర్వాత పదవిని కోల్పోయిన వ్యక్తి అధ్యక్షుడికి విశ్వాసపాత్రురాలైన అటార్నీ జనరల్ పామ్ బాండీ. ట్రంప్ ప్రభుత్వాన్ని గుడ్డిగా సమర్థించిన బాండీ ప్రభుత్వానికి శత్రువులుగా భావించిన వారిని లక్ష్యంగా చేసుకోవడానికి న్యాయ శాఖను దూకుడుగా పునర్నిర్మించారు. చివరికి ఏప్రిల్ 2న ట్రంప్ పామ్ బాండీని తొలగించారు. దీంతో కేవలం ఒక నెలలోనే పదవి నుంచి ఉద్వాసనకు గురైన రెండో క్యాబినెట్ సభ్యురాలిగా ఆమె నిలిచారు. అయితే ఈ ఇద్దరితోనే ఈ ఉద్వాసనలు ఆగేలా లేవు.
ట్రంప్ విధేయుల్లో మరికొందరికి త్వరలోనే ఉద్వాసనలు ఉండవచ్చని ది అట్లాంటిక్, ది పొలిటికో, ది గార్డియన్ పత్రికా కథనాలు సూచిస్తున్నాయి. ట్రంప్ చాలా కోపంగా ఉన్నారని, తన సిబ్బందిని బదిలీ చేయనున్నారని తన పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ ప్రభుత్వ అధికారి పొలిటికోతో అన్నారు. ట్రంప్ కోపానికి బలి కానున్న వారిలో ఎఫ్‌బీఐ డైరెక్టర్ కాష్ పటేల్(ఈయన వ్యక్తిగత ఖాతాలను ఇటీవల ఇరాన్‌తో సంబంధం ఉన్న ఒక బృందం హ్యాక్ చేసింది), కార్మిక శాఖ మంత్రి బోరీ చావెజ్-డిరెమెర్, వాణిజ్య మంత్రి హోవార్ లుట్నిక్, సైనిక శాఖ మంత్రి డేనియల్ డిస్కాల్, జాతీయ నిఘా డైరెక్టర్ తులసి గబార్డ్ ఉన్నారని తెలుస్తున్నది.