Trump Tariffs | వాషింగ్టన్, ఆగస్టు 31 : ‘మేక్ అమెరికా గ్రేట్ అగైన్’ అనే నినాదంతో అధికారం చేపట్టిన అధ్యక్షుడు ట్రంప్ తమను గొప్పవారిని చేయడం మాట అటుంచి అదనపు భారంతో పేదరికంలోకి తోసేస్తున్నారంటూ ఆ దేశ పౌరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టారిఫ్ల జపం చేస్తూ విదేశీ వస్తువులపై ఎడాపెడా పన్నులు వేస్తున్న ఆయన అంతిమంగా ఆ భారం తమపైనే పడుతుందన్న విషయాన్ని ఎలా మర్చిపోయారని వారు నిలదీస్తున్నారు. టారిఫ్ల పిడుగు తమపైనే పడుతున్నదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆయన విధిస్తున్న పన్నులు, పన్ను విధానాల వల్ల ఆ దేశంలో నిత్యావసరాలు, విద్యుత్తు ధరలు భారంగా మారుతున్నాయి. అమెరికన్ల నెలవారీ ఖర్చులపై వందలాది డాలర్ల అదనపు భారం పడుతున్నది. ట్రంప్ చర్యలు దిగువ, మధ్యతరగతి వర్గాలపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతున్నది.
అమెరికాన్ల ఆర్థిక స్తోమతను పునరుద్ధరిస్తానని, ద్రవ్యోల్బణాన్ని అదుపుచేస్తానని 2024 ఎన్నికల ప్రచారంలో ట్రంప్ పదేపదే వాగ్దానం చేశారు. ‘నేను అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే ధరలను తగ్గిస్తా’ అని గత ఏడాది ఆగస్టులో జరిగిన ఒక భారీ బహిరంగ సభలో ట్రంప్ హామీనిచ్చారు. అయితే అధికారం చేపట్టిన తర్వాత ఆయన చేసిన వాగ్దానాలు నెరవేర్చడం మాట దేవుడెరుగు, డాటాను పరిశీలిస్తే దానికి విరుద్ధంగా జరుగుతున్నది. ముఖ్యంగా ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్లు చట్టం తేవడం, విదేశీ ఉత్పత్తులపై అదనపు సుంకాలు విధించడంతో దేశ ఆర్థిక వ్యవస్థ తీవ్ర ఒడిదొడుకులకు లోనవుతున్నది.
ట్రంప్ యంత్రాంగం ‘డీ మినిమస్’ నిబంధనను తొలగించడం అమెరికా వినియోగదారులకు శాపంగా మారింది. ఈ నిబంధన ప్రకారం అప్పటి వరకు 800 డాలర్ల విలువ లోపు దిగుమతి చేసుకునే విదేశీ వస్తువులపై ఎలాంటి కస్టమ్స్ పన్ను ఉండేది కాదు. దీంతో అప్పటివరకు అమెరికన్లు తక్కువ ఖరీదు గల వస్తువులను ఆన్లైన్లో సులభంగా, చౌకగా కొనుగోలు చేసేవారు. అయితే ట్రంప్ దానిని తొలగించడంతో దిగుమతి చేసుకునే ప్రతి వస్తువుపై పన్ను పడటంతో వాటి ధరలు కూడా పెరిగాయి. ఆ పెరిగిన భారం అమెరికా పౌరుడిపై పడటంతో వారు లబోదిబోమంటున్నారు.
ట్రంప్ అధ్యక్షుడుయ్యాక విధిస్తున్న టారిఫ్లను దిగుమతిదారులు వినియోగదారులకు బదిలీ చేస్తున్నారని, అంతమంగా ఆ టారిఫ్ల వల్ల సగటు అమెరికా పౌరునిపై తీవ్ర భారం పడుతున్నదని 9ఐ కేపిటల్ గ్రూప్ సీఈవో థామ్సన్ తెలిపారు.