మాస్కో, డిసెంబర్ 12: రష్యా ప్రతిపక్ష నేత, పుతిన్ ప్రత్యర్థి అలెక్సీ నావల్నీ జైల్లో కనిపించడం లేదని ఆయన సన్నిహితులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆయనను ప్రత్యేక జైలుకు తరలిస్తారని భావించిన వేళ ఈ పరిణామం చోటుచేసుకుందని వారు చెప్తున్నారు. రష్యాలో ఖైదీలను రైళ్లలో తరలించడానికి వారాల కొద్దీ సమయం పడుతుంది. నిర్దేశిత జైలుకు తరలించిన తర్వాతే వారిని సంప్రదించడానికి వీలవుతుంది. నావల్నీని ఏ జైలుకు మార్చారో తమకు సమాచారం లేదని ఆయన తరపు న్యాయవాదులు, కుటుంబ సభ్యులు తెలిపారు. ‘ఆయన ప్రస్తుతం ఎక్కడున్నారో తెలియదు. ఆయన రష్యాలోని 30 ప్రత్యేక జైళ్లలో ఎక్కడో ఒకచోట ఉండొచ్చు. మేం ప్రతి జైలుకు వెళ్లి ఆయన కోసం వెతుకుతాం’ అని నావల్నీ అధికార ప్రతినిధి కిరా యర్మిష్ తెలిపారు. వచ్చే ఏడాది రష్యా అధ్యక్ష ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో తాజా పరిణామం చోటుచేసుకున్నది.