మాస్కో, సెప్టెంబర్ 21: ఉక్రెయిన్‌తో యుద్ధంలో రోజురోజుకు బలహీనపడుతున్న నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా నేతృత్వంలోని పాశ్చాత్య దేశాలు అణ్వాయుధాలను చూపిస్తూ బ్లాక్మెయిల్ చేయాలనుకొంటున్నాయని, ఆ పరిస్థితులు తిరగబడే అవకాశం ఉన్నదని గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. అవసరమైతే అణుబాంబు వేస్తామని చెప్పకనే చెప్పారాయన.
బుధవారం దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన పుతిన్.. నాటో దళాల వద్ద ఉన్న ఆయుధాల కంటే అత్యాధునిక ఆయుధాలు రష్యా వద్ద ఉన్నాయని వివరించారు. మొత్తం పాశ్చాత్య దేశాల మిలిటరీతో పోరాడుతున్నామని, ఉన్నఫలంగా 3 లక్షల మంది రిజర్వ్ బలగాలను సిద్ధం చేస్తున్నామని వెల్లడించారు. దీనికోసం ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ చేశానని చెప్పారు. రష్యా సమగ్రత, ప్రజలను కాపాడుకోవటానికి అన్ని వనరులను ఉపయోగించుకొంటామని స్పష్టం చేశారు. విముక్త ప్రదేశాల్లో ప్రజలను కాపాడేందుకు అత్యవసర నిర్ణయాలు తీసుకొంటున్నట్టు పేర్కొన్నారు. రష్యాను బలహీనపర్చడానికి, విభజించటానికి పాశ్చాత్య దేశాలు కుట్ర చేస్తున్నాయని, ఆ దేశాలన్నీ హద్దు మీరాయని పుతిన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
అణుదాడులను ప్రపంచం ఒప్పుకోదు: జెలెన్స్కీ
అవసరమైతే అణు దాడులకు దిగుతామన్న వ్లాదిమిర్ పుతిన్ వ్యాఖ్యలపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ స్పందించారు. ‘రష్యా అణు బాంబు వాడుతుందని అనుకోవటం లేదు. అందుకు ప్రపంచ దేశాలు ఒప్పుకొంటాయని నేను భావించటం లేదు. సొంత సైన్యంతో పాటు ఉక్రెయిన్ను రక్తంలో ముంచేస్తా’ అన్నట్టు పుతిన్ వ్యాఖ్యలు ఉన్నాయని జెలెన్స్కీ తీవ్రంగా మండిపడ్డారు.
పారిపోతున్న రష్యన్లు
పాక్షిక బలగాల సేకరణ చేపడతామని రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రకటించటంతో విమానాల కోసం రష్యన్లు పరుగులు పెడుతున్నారు. వన్ వే టికెట్ బుక్ చేసుకొని దేశం దాటి పారిపొయ్యేందుకు సిద్ధమవుతున్నారు. టికెట్ రేట్లు ఆకాశాన్ని అంటుతున్నా, బుక్ చేసుకొనేందుకు వెనుకాడటం లేదు. వచ్చే కొన్ని రోజుల వరకు విమానాల్లో అసలు టికెట్లు ఖాళీ లేవంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉన్నదో అర్థం చేసుకోవచ్చు.