ఫిలడెల్ఫియా: అమెరికా అధ్యక్ష అభ్యర్థులుగా పోటీపడుతున్న డోనాల్డ్ ట్రంప్, కమలా హ్యారిస్‌లు(Kamala Harris Vs Donald Trump).. ఏబీసీ న్యూస్ నిర్వహించిన చర్చలో పాల్గొన్నారు. ఆ ఇద్దరూ అనేక అంశాలపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. అబార్షన్లు, యుద్ధాలు, ఆర్థికం, హౌజింగ్ సంక్షోభం లాంటి అంశాలపై చర్చించుకున్నారు. రిపబ్లిక్ పార్టీ అభ్యర్థి ట్రంప్, డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హ్యారిస్.. పోటాపోటీగా డిబేట్లో పాల్గొన్నారు. తొలుత ఇద్దరూ చర్చావేదికపై హ్యాండ్‌షేక్ ఇచ్చుకున్నారు. ఆ తర్వాత తమ విధానాలను వివరించారు.
ఒకవేళ అధ్యక్షురాలిగా ఎన్నికైతే, మధ్యతరగతి కుటుంబాలకు, చిన్న వ్యాపారులకు సపోర్టు ఇవ్వనున్నట్లు హ్యారిస్ వెల్లడించారు. ట్రంప్ గెలిస్తే ఆయన కేవలం బిలియనీర్లకు మాత్రమే పన్ను మినహాయింపులు కల్పిస్తారని హ్యారిస్ ఆరోపించారు. దేశ ప్రజల కోసం ట్రంప్ వద్ద ఎటువంటి ప్రణాళిక లేదని ఆమె పేర్కొన్నారు. బైడెన్ సర్కారులో ఇమ్మిగ్రేషన్ విధానం సరిగా లేదని ట్రంప్ ఆరోపించారు. ట్రంప్ పాలన సమయంలో దేశంలో నిరుద్యోగం పెరిగినట్లు హ్యారిస్ పేర్కొన్నారు.
ఓ దశలో ఇద్దరూ వ్యక్తిగత విమర్శలు కూడా చేసుకున్నారు. హ్యారిస్ ఓ మార్కిస్టు అని, ఆమె తండ్రి మార్కిస్టు అని ట్రంప్ పేర్కొన్నారు. కోవిడ్ మహమ్మారి సమయంలో దేశానికి ఎంతో చేసినట్లు ట్రంప్ చెప్పుకున్నారు. ఒకవేళ ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికైతే, అబార్షన్లపై నిషేధం విధిస్తారని హ్యారిస్ ఆరోపించారు. అయితే దేశవ్యాప్తంగా అబార్షన్లను నిషేధించేందుకు చట్టాన్ని తెస్తారా అన్న ప్రశ్నకు ట్రంప్ దాటవేశారు.
బైడెన్ పాలనలో క్రైం పెరిగినట్లు ట్రంప్ పేర్కొన్నారు. ఆ ఆరోపణలను హ్యారిస్ ఖండించారు. ట్రంప్‌పైనే కేసులు ఉన్నాయని, రాజకీయ బలంతో ఆయన న్యాయవ్యవస్థపై ఆధిపత్యం చూపించినట్లు ఆరోపించారు. ఇజ్రాయిల్-హమస్ యుద్ధంపై కూడా ఇద్దరూ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఒకవేళ తాను దేశాధ్యక్షుడిగా ఉండి ఉంటే, ఆ యుద్ధం వచ్చేదికాదని ట్రంప్ తెలిపారు. ఇజ్రాయిల్‌కు సపోర్టు ఇస్తున్నట్లు హ్యారిస్ తెలిపారు.
ఒకవేళ ట్రంప్ అధ్యక్షుడైతే, పుతిన్ కీవ్‌లో ఉండేవారని హ్యారిస్ విమర్శించారు. పుతిన్ వత్తిడికి ట్రంప్ తలొగ్గేవాడు అని ఆమె పేర్కొన్నారు. కీవ్‌లో కూర్చున్న పుతిన్.. పశ్చిమ దేశాలపై కన్నేసేవాడని, స్నేహం పేరుతో చాలా తొందరగా పుతిన్‌కు లొంంగిపోయేవాడవనని, లంచ్‌కు పుతిన్ నిన్ను తినేసేవాడని హ్యారిస్ ఆరోపించారు. రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్దం ఆపడమే తన ఉద్దేశం అని ట్రంప్ తెలిపారు. అమెరికా మంచి కోసం ఈ యుద్ధాన్ని త్వరగా నిలిచిపోవాలని ఆశించారు.