అంతర్జాతీయ మీడియా
లండన్/మాస్కో, మే 30: రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆరోగ్యంపై విపరీతంగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఉక్రెయిన్‌పై దాడి ప్రారంభమైన అనంతరం మరింత ఎక్కువయ్యాయి. క్యాన్సర్ కారణంగా పుతిన్ ఆరోగ్యం క్షీణిస్తున్నదని, ఆయన మరో మూడేండ్లు మాత్రమే బతుకుతారని వైద్యులు చెప్పారని రష్యన్ ఫెడరల్ సెక్యూరిటీ సర్వీస్(ఎఫ్ఎస్బీ)కి చెందిన ఓ అధికారిని ఉటంకిస్తూ ‘ఇండిపెండెంట్’తో పాటు పలు అంతర్జాతీయ మీడియా సంస్థల తాజా కథనాలు పేర్కొన్నాయి.
పుతిన్ ఆరోగ్య వివరాలను ఎఫ్ఎస్బీ అధికారి యూకేలో ఉండే రష్యా మాజీ గూఢాచారి బోరిస్ కర్పిచ్కోవ్కు పంపారని తెలిపాయి. పుతిన్ కంటిచూపు క్రమంగా మందగిస్తున్నదని, తీవ్ర తలనొప్పితో బాధపడుతున్నారని, కాళ్లుచేతులు వణికే సమస్య పెరిగినట్టు ఆ సందేశంలో ఉన్నదని వెల్లడించాయి. అయితే పుతిన్ అనారోగ్యంపై వార్తలను రష్యా విదేశాంగ మంత్రి లావ్రోవ్ ఆదివారం ఖండించారు. పుతిన్ పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని, ప్రతిరోజూ పబ్లిక్‌గా కనిపిస్తున్నారని పేర్కొన్నారు. మరోవైపు తూర్పు ఉక్రెయిన్‌లోని సీవీరోడొనెట్స్ పట్టణ శివార్లలోకి రష్యా బలగాలు ప్రవేశించాయని లుహాన్స్ రీజియన్ గవర్నర్ సెర్హి హైదాయ్ వెల్లడించారు. సమీపంలోని లిసిచాన్స్ వైపు కూడా వెళ్తున్నాయని పేర్కొన్నారు. రష్యా తాజా షెల్లింగ్ దాడుల్లో ఇద్దరు పౌరులు మరణించగా, ఐదుగురికి గాయాలయ్యాయని తెలిపారు.