కీవ్: రష్యా అధ్యక్షుడు పుతిన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇష్టపూర్వంగా రష్యా దళాలకు సహకరించాలనుకున్నవారిని ఉక్రెయిన్‌కు పంపేందుకు పుతిన్ ఆదేశాలు జారీ చేశారు. వాలంటీర్ ఫైటర్లకు అనుమతి ఇవ్వాలన్న అంశంపై ఆయన సమావేశం నిర్వహించారు. ఆ మీటింగ్‌లో వాళ్లకు అనుమతి కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. రష్యా బలగాలకు అండగా పోరాడేందుకు మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో సుమారు 16వేల మంది వాలంటీర్లు ఉన్నట్లు రష్యా రక్షణ మంత్రి సెర్గీ షోయిగూ తెలిపారు.
రష్యా తరపున పోరాటం చేసేందుకు సిరియా ప్రభుత్వ దళాలు సిద్ధంగా ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. గతంలో సిరియా అధ్యక్షుడు బాషర్ అల్ అసద్‌కు అండగా రష్యా బలగాలు సహకరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సిరియా సాయం రష్యా తీసుకుంటుందో ఏమో అన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
మరోవైపు రష్యా చేస్తున్న దాడులతో సైనికుల కన్నా ఎక్కువ సంఖ్యలో సాధారణ ప్రజలు మృతిచెందినట్లు ఉక్రెయిన్ రక్షణ మంత్రి ఒలెక్సీ రెజ్నికోవ్ తెలిపారు. ఈ విషయాన్ని కీవ్ ప్రజలే కాదు.. యావత్ ప్రపంచం గమనించాలని ఆయన అన్నారు. తాజాగా పశ్చిమ ప్రాంతంలో ఉన్న నగరాలపై రష్యా దాడి చేస్తున్న నేపథ్యంలో ఉక్రెయిన్ ఈ ఆరోపణ చేసింది.