ఉక్రెయిన్‌పై రష్యా దళాలు అక్రమంగా దాడులకు తెగబడ్డాయంలూ పశ్చిమ దేశాలన్నీ రష్యాపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే రష్యాపై ఆంక్షల కొరడాలు ఝుళిపించాయీ దేశాలు. ఇప్పుడు తాజాగా రష్య అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్.. తమ దేశంపై ఆంక్షలు విధించిన దేశాలకు ఝలక్ ఇచ్చాడు.
ఇంతకుముందే 48 దేశాలతో రష్యా ప్రభుత్వం ఒక జాబితా విడుదల చేసింది. ఈ దేశాలేవీ రష్యా మిత్రపక్షాలు కావని స్పష్టం చేసింది. ఈ జాబితాలో అన్ని యూరప్ దేశాలు, అమెరికా, నార్వే, జపాన్, స్విట్జర్లాండ్, ఆస్ట్రేలియా, న్యూజిల్యాండ్ తదితర దేశాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ దేశాలు తమ నుంచి సహజవాయువు కొనుగోలు చేయాలంటే కచ్చితంగా తమ దేశపు కరెన్సీ రష్యన్ రూబల్స్లోనే చెల్లింపులు చేయాలని పుతిన్ ప్రకటించాడు.
రష్యాపై ఆంక్షల వల్ల ఆ దేశపు మార్కెట్లు అతలాకుతలం అవుతున్నాయి. యూరో, యూఎస్ డాలర్‌తో పోలిస్తే రష్యా రూబెల్ విలువ ఘోరంగా పతనమైంది. ఇలాంటి సమయంలో పరిస్థితిని చక్కదిద్దేందుకే పుతిన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో మాస్కో మార్కెట్లో రష్యా రూబెల్ విలువ అనూహ్యంగా పుంజుకుంది.
అయితే అంతకుముందు అంగీకరించిన సహజవాయువు పరిణామాలు, ధరల ప్రకారమే తాము అమ్మకాలు కొనసాగిస్తామని, కేవలం చెల్లింపు విధానం మాత్రమే రూబెల్కు మారుతుందని పుతిన్ చెప్పారు. ఆ వెంటనే రష్యా అంతరిక్ష సంస్థ రాస్‌కాస్మోస్ కూడా ఇక నుంచి తాము చేసే అంతర్జాతీయ కాంట్రాక్టులన్నీ రూబెల్స్లోనే చేస్తామని ప్రకటించింది.
దీంతో రష్యా నుంచి వచ్చే దిగుమతులపై ఎక్కువగా ఆధారపడే జర్మనీ, ఆస్ట్రియా వంటి దేశాలు ఈ నిర్ణయం సరైంది కాదని గగ్గోలు పెడుతున్నాయి. ఇది కాంట్రాక్ట్‌ను ఉల్లంఘించడమేని, ఈ విషయంలో ఏం చేయాలో తమ యూరోపియన్ భాగస్వాములతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని జర్మనీ చెప్పింది.
ఈ దేశంలో ఉపయోగించే దాదాపు 55 శాతం సహజవాయువు రష్యా నుంచే వస్తుంది. అయితే తాము రూబెల్స్లో చెల్లింపులు చేయడం కుదరదని ఆస్ట్రియా అధికారులు అంటున్నారు. అంతేకాదు, యూరప్‌లోని చాలా దేశాలు సహజ వాయువు, చమురు కోసం రష్యా దిగుమతులపైనే ఆధార పడతాయి. ఈ క్రమంలోనే పుతిన్ నిర్ణయం తర్వాత ఎటువంటి స్టెప్స్ తీసుకోవాలని ఈ దేశాలు చర్చలు చేస్తున్నట్లు సమాచారం.