Putin-Zelenskyy | రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Vladimir Putin)తో అలస్కా వేదికగా ట్రంప్ భేటీ అయిన విషయం తెలిసిందే. ఇక నిన్న ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ (Zelenskyy)తో కూడా అమెరికా అధ్యక్షుడు సమావేశమయ్యారు. మరో రెండు వారాల్లో పుతిన్-జెలెన్స్కీ (Putin-Zelenskyy) భేటీ ఉండనున్నట్లు తాజా సమాచారం. చర్చల అనంతరం రష్యా అధినేతతో ట్రంప్ ఫోన్లో మాట్లాడినట్లు యూరోపియన్ నేతలు (EU Leaders) తెలిపారు. వచ్చే పక్షం రోజుల్లో జెలెన్స్కీతో భేటీ అయ్యేందుకు పుతిన్ అంగీకరించినట్లు తెలిపారు.
కాగా, ఇరుదేశాల సంఘర్షణకు తెరదించేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ, యూరోపియన్ నేతలు సోమవారం సమావేశం అయిన విషయం తెలిసిందే. సమావేశం అనంతరం వైట్‌హౌస్ వెలుపల జర్మన్ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్ మాట్లాడుతూ.. జెలెన్స్కీతో సమావేశానికి పుతిన్ అంగీకరించినట్లు చెప్పారు. అయితే, ఆ భేటీ ఎక్కడ, ఎప్పుడు ఉంటుందన్నది ఇంకా ఖరారు కాలేదన్నారు. మరోవైపు త్రైపాక్షిక సమావేశానికి తాము సిద్ధంగా ఉన్నామని యూరోపియన్ నేతలు తెలిపారు.
ఇదిలా ఉండగా.. జెలెన్స్కీ (Zelenskyy), యురోపియన్ దేశాల నేతలతో సమావేశం ముగిసిన అనంతరం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. త్వరలోనే రష్యా అధ్యక్షుడు పుతిన్, జెలెన్స్కీ మధ్య భేటీకి ఏర్పాట్లు జరుగుతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇరువురు సమావేశమయ్యేందుకు అమెరికా ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రకటించారు. సుమారు నాలుగేళ్ల యుద్ధాన్ని ముగించేందుకు ఇది కీలక అడుగుగా అభివర్ణించారు. ఈ మేరకు తన సోషల్ మీడియా ట్రూత్‌లో పోస్టు చేశారు. 2022 ఫిబ్రవరిలో ఉక్రెయిన్‌పై రష్యా దాడి (Ukrain-Russia War) ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ యుద్ధానికి ముగింపు పలికేందుకు ట్రంప్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. పుతిన్-జెలెన్స్కీ భేటీతోనైనా ఈ యుద్ధానికి ముగింపు పడుతుందో లేదో చూడాలి మరి..
Also Read..
Donald Trump | యుద్ధం ఆగిపోవాలనేదే పుతిన్ ఆకాంక్ష.. జెలెన్స్కీతో ట్రంప్
Donald Trump | యుద్ధాన్ని ఆపాలా? వద్దా? అనేది నీ చేతుల్లోనే ఉంది.. ఆ రెండిటిపై ఆశలు వదులుకో..!
Trilateral Meet | ఆగస్టు 22న ట్రంప్, పుతిన్, జెలెన్స్కీల త్రైపాక్షిక సమావేశం..!