Pulwama attack : పుల్వామా ఉగ్రదాడి ప్రధాన సూత్రధారి, మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ హమ్జా బుర్హాన్‌ను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ముజఫరాబాద్‌లో గురువారం గుర్తు తెలియని వ్యక్తులు అతడిని కాల్చి చంపారు. 2019లో కశ్మీర్‌లోని పుల్వామాలో, ఫిబ్రవరి 14న జరిగిన తీవ్రవాద దాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడులకు హమ్జా బుర్హాన్ ప్రధాన సూత్రధారిగా తెలుస్తోంది. అతడు నిజానికి భారతీయుడు.
డాక్టర్‌గా పిలిచే అతడి అసలుపేరు అర్జుమండ్ గుల్జార్ దర్. పుల్వామాలోని రత్నిపురా ప్రాంతానికి చెందినవాడు. చిన్నప్పటి నుంచి తీవ్రవాద భావజాలంతో ఉండేవాడు. పుల్వామా దాడికి ముందు కూడా కాశ్మీర్ పరిధిలో జరిగిన పలు దాడుల్లో అతడి ప్రమేయం ఉంది. 2017లో ఉన్నత చదువుల కోసం పాకిస్తాన్ వెళ్లాడు. అయితే, అక్కడ చదువును పక్కనబెట్టి నిషేధిత తీవ్రవాద సంస్థ అయిన అల్ బదర్‌లో చేరాడు. కొద్ది రోజుల్లోనే ఆ సంస్థకు కమాండ్ స్థాయికి ఎదిగాడు. కొంతకాలానికి కాశ్మీర్ తిరిగివచ్చి, అక్కడి యువతను ఉగ్రవాదం వైపు నడిపించాడు.
తన నెట్‌వర్క్‌ను నెమ్మదిగా దక్షిణ కాశ్మీర్లో విస్తరించాడు. పుల్వామా నుంచి షోపియన్ వరకు తన మనుషుల్ని ఏర్పాటు చేసుకున్నాడు. బుర్హాన్ చాలా మందిని ఉగ్రవాదం వైపు నడిపించాడు. ఇదే క్రమంలో 2019లో పుల్వామా దాడికి కీలక సూత్రధారిగా వ్యవహరించాడు. ఈ దాడికి పాల్పడింది జైషే మొహమ్మద్ సంస్థ. ఈ దాడికి అవసరమైన పేలుడు పదార్థాలను హమ్జా బుర్హాన్ అందించాడు. ఆ సమయంలో భద్రతా బలగాలు అతడి కోసం వెతకగా.. అతడు పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోకి పారిపోయాడు. తాజాగా గుర్తు తెలియని వ్యక్తులు అతడిని కాల్చి చంపారు.
బుల్లెట్ గాయాల కారణంగా రక్తస్రావం జరిగి అతడు మరణించాడు. హమ్జా బుర్హాన్‌ను కేంద్ర హోం శాఖ 2022లో మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్‌గా ప్రకటించింది. ఇటీవలి కాలంలో ఇలా ఉగ్ర సంస్థలతో లింకులు ఉన్న చాలా మంది ఉగ్రవాదుల్ని పాక్‌లో గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపుతున్నారు.