Bangladesh Protests : సంక్షోభిత బంగ్లాదేశ్లో మరోసారి అల్లర్లు చెలరేగాయి. ఈసారి నిరసనకారులు సుప్రీంకోర్టును లక్ష్యంగా చేసుకున్నారు. ప్రధాన న్యాయమూర్తి వెంటనే రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. ఇతర న్యాయమూర్తులు దిగిపోవాలంటూ పట్టుబట్టారు. దాంతో ప్రధాన న్యాయమూర్తి దిగొచ్చారు. తాను తన పదవికి రాజీనామా చేసేందుకు అంగీకరించారు.
బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఈ ఉదయం ఇతర న్యాయమూర్తులతో సమావేశానికి పిలుపునిచ్చారు. అయితే ఈ సమావేశానికి తాత్కాలిక ప్రభుత్వ అనుమతి లేదని, ప్రధాన న్యాయమూర్తి దేశం విడిచి పారిపోవచ్చనే వార్తలు గుప్పుమన్నాయి. దాంతో ఒక్కసారిగా చెలరేగాయి. విద్యార్థులతోపాటు పలువురు నిరసనకారులు సుప్రీంకోర్టు వద్దకు చేరుకొని ఆందోళన చేపట్టారు.
ఈ క్రమంలో న్యాయమూర్తుల సమావేశం అర్ధంతరంగా ఆగిపోయింది. అక్కడితో శాంతించని ఆందోళనకారులు కోర్టును చుట్టుముట్టారు. చీఫ్ జస్టిస్ గంటలో దిగిపోవాలంటూ డిమాండ్ చేశారు. తప్పనిసరి పరిస్థితుల్లో ప్రధాన న్యాయమూర్తి అందుకు అంగీకరించారు. కాగా, రిజర్వేషన్లపై విద్యార్థుల నిరసనలు హింసాత్మకంగా మారడంతో ప్రధాని షేక్ హసీనా ఇటీవల పదవి నుంచి వైదొలిగారు.
ఆమె ప్రస్తుతం భారత్లో ఆశ్రయం పొందుతున్నారు. మరోవైపు దేశాధ్యక్షుడు పార్లమెంటును రద్దు చేశారు. తాత్కాలిక పరిపాలన యంత్రాంగానికి మహ్మద్ యూనస్ సారథిగా నియమితులయ్యారు. జులై నుంచి దశలవారీగా జరుగుతోన్న ఆందోళనల్లో 400 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. వీటి వెనుక విదేశీ హస్తం ఉందంటూ వార్తలు వినిపిస్తున్నాయి.