Bangladesh | ఢాకా, అక్టోబర్ 23: బంగ్లాదేశ్లో మరోసారి ఉద్రిక్తతలు తలెత్తాయి. దేశాధ్యక్షుడు మహమ్మద్ షహబుద్దిన్ రాజీనామాకు డిమాండ్ చేస్తూ రాజధాని ఢాకాలో నిరసనలు మొదలయ్యాయి. మంగళవారం రాత్రి వందలాదిగా నిరసనకారులు అధ్యక్ష భవనమైన బంగభవన్ను ముట్టడించారు. వెంటనే షహబుద్దిన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జీ చేయడంతో పాటు బాష్పవాయువు ప్రయోగించారు. దీంతో ఇద్దరు జర్నలిస్టులు సహా నలుగురికి గాయాలయ్యాయి. మాజీ ప్రధాని షేక్ హసీనాకు వ్యతిరేకంగా జరిగిన విద్యార్థి ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన హస్నత్ అబ్దుల్లా, సర్జిస్ అలామ్ అక్కడికి చేరుకొని నిరసనకారులకు నచ్చజెప్పారు. రెండు రోజుల్లో అధ్యక్షుడు మారతారని హామీ ఇవ్వడంతో నిరసనకారులు శాంతించారు. షహబుద్దిన్ను పదవిలో కొనసాగించడమా, లేదా అనేది అన్ని పక్షాలతో చర్చించి త్వరలో నిర్ణయం తీసుకుంటామని ఆపద్ధర్మ ప్రభుత్వ చీఫ్ అడ్వైజర్ మహమ్మద్ యూనస్ ప్రెస్ సెక్రటరీ షఫికుల్ అలామ్ తెలిపారు.
హసీనా రాజీనామా లేఖ అందలేదు: షహబుద్దిన్
తీవ్ర నిరసనలకు తలొగ్గి ఆగస్టు 5న బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా దేశం విడిచి భారత్కు చేరారు. ఆమె ప్రధాని పదవికి రాజీనామా చేశారని అప్పుడు అధ్యక్షుడు షహబుద్దిన్తో పాటు ఆర్మీ చీఫ్ ప్రకటించారు. దీంతో ఆపద్ధర్మ ప్రభుత్వం కూడా ఏర్పడింది. అయితే, తాజాగా ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో హసీనా రాజీనామా లేఖ తనకు అందలేదని షహబుద్దిన్ వ్యాఖ్యానించడమే నిరసనకారుల ఆగ్రహానికి కారణమైంది. హసీనా రాజీనామా లేఖ పొందేందుకు చాలాసార్లు ప్రయత్నించి విఫలమయ్యానని, బహుశా ఆమెకు సమయం లేదేమోనని షహబుద్దిన్ వ్యాఖ్యానించారు. దీంతో షహబుద్దిన్ రాజీనామాకు నిరసనకారులు పట్టుబడుతున్నారు. కాగా, హసీనా రాజీనామా చేయలేదని, ఆమె బతికే ఉన్నారు కాబట్టి యూనస్ ప్రభుత్వం చట్టవిరుద్ధమని బంగ్లాదేశీ రచయిత్రి తస్లీమా నస్రీన్ ‘ఎక్స్’లో పేర్కొన్నారు.