వాషింగ్టన్: భారత సంతతికి చెందిన సీనియర్ టెకీ అమెరికాలో కన్నుమూశారు. సియాటెల్‌కు చెందిన వెంచర్ క్యాపిటల్ సంస్థ మద్రోనా వెంచర్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న ఎస్.సోమసేగర్ (59) ఆకస్మికంగా మరణించారు. ఈ ఘటనను ధృవీకరించిన మద్రోనా వెంచర్ సంస్థ.. ఆయనకు నివాళులర్పించింది. అయితే ఆయన మరణానికి గల కారణాలు తెలియరాలేదు.
పుదుచ్చేరిలో జన్మించిన సోమసేగర్ మైక్రోసాఫ్ట్‌లో దాదాపు మూడు దశాబ్దాలపాటు ఎగ్జిక్యూటివ్‌గా పనిచేశారు. 2015లో మైక్రోసాఫ్ట్ నుంచి వైదొలగిన ఆయన.. మద్రోనా వెంచర్ గ్రూప్‌లో ఎండీగా చేరారు. అమెరికా సహా ప్రపంచవ్యాప్తంగా పలు స్టార్టప్ కంపెనీల్లో ఈయనకు పెట్టుబడులున్నాయి. సోమసేగర్ ఆకస్మిక మరణంపై టెక్ పరిశ్రమలోని ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయనకు నివాళులర్పించారు.