Pakistan | ఇస్లామాబాద్ : మరో రెండు రోజుల్లో రంజాన్ మాసం ప్రారంభం కానుంది. రంజాన్ వేళ పాకిస్తాన్లో నిత్యావసరాల ధరలు మూడింతలు పెరిగాయి. దీంతో స్థానికులు ఆందోళనకు గురవుతున్నారు. కూరగాయలు, పాలు, చక్కెర, వంట నూనె, నెయ్యి, మాంసం, కోడిగుడ్లు, చిరు ధాన్యాల రేట్లు బాగా పెరిగిపోయాయి. సామాన్య జనాలు కొనలేని పరిస్థితి ఏర్పడిందని స్థానికులు వాపోతున్నారు.
రంజాన్ ఉపవాస దినాల నేపథ్యంలో ఉల్లిపాయకు భారీగా డిమాండ్ ఉంటుంది. ప్రస్తుతం కిలో ఉల్లిపాయ ధర రూ. 150 నుంచి రూ. 300కు పెరిగింది. కొందరైతే ఆఫర్ల కింద కిలో ఉల్లి ధర రూ. 250గా నిర్ధారించారు. పండ్ల ధరలు అయితే ఆకాశాన్నంటాయి. కిలో బంగాళాదుంప ధర రూ. 50 నుంచి రూ. 80కి పెరిగింది. క్యాబేజ్ దర రూ. 80 నుంచి రూ. 150కి పెరగ్గా, కిలో పచ్చి మిర్చిని రూ. 320కి విక్రయిస్తున్నారు. క్యాప్సికం ధర రూ. 400గా ఉంది. డజన్ అరటి పండ్ల ధర రూ. 80 నుంచి రూ. 120కి పెరిగింది. నాణ్యమైన అరటి పండ్లు అయితే డజన్ రూ. 200 పలుకుతోంది. తర్బుజా ధర రూ. 200గా ఉంది. ఈ ధరలతో పాకిస్తానీయులు బెంబేలెత్తిపోతున్నారు.