Prachanda @ Nepal PM | నేపాల్ కొత్త ప్రధానిగా పుష్ప కమల్ దహల్ అలియాస్ ప్రచండ నియమితులయ్యారు. ఈ మేరకు నేపాల్ రాష్ట్రపతి విద్యాదేవి భండారీ సోమవారం ఆయనతో ప్రమాణం చేయించారు. డిసెంబర్ 25న ప్రచండ నియామకాన్ని ప్రకటించగా.. మూడోసారి నేపాల్ ప్రధాని పీఠం అధిష్టించారు. తొలిసారిగా 2008 నుంచి 2009 వరకు, రెండోసారి 2016 నుంచి 2017 వరకు ప్రధానిగా ఉన్నారు.
మాజీ ప్రధాని, కమ్యూనిస్టు నాయకుడు కేపీ శర్మ ఓలీతో సహా మరో 5 సంకీర్ణ పార్టీలతో కలిసి ప్రచండ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. వీరి మధ్య ఒప్పందం కుదిరింది. రొటేషన్ ప్రకారం మొదటి రెండున్నరేండ్లు ప్రచండ ప్రధానిగా ఉండగా.. తదుపరి రెండున్నేండ్లు కేపీ శర్మ ఓలి మరోసారి ప్రధాని అవుతారన్నమాట. ఇప్పటి వరకు నేపాల్‌లో ప్రభుత్వం ఏర్పడినప్పుడల్లా ప్రధానమంత్రి తన మొదటి విదేశీ పర్యటన భారత్‌లోనే చేశారు. అయితే, 2008లో రాచరికం ముగిసిన తర్వాత ప్రచండ ప్రధాని అయ్యాక ఆయన నేరుగా చైనాలో పర్యటించారు. ఈసారి ప్రభుత్వం ఏర్పాటుకు 5 నెలల ముందు జూలైలో ఆయన భారత్‌కు వచ్చారు. ప్రధానిని కలవలేకపోయిన ప్రచండ.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ అయ్యారు.
నేపాల్ ప్రధానిగా ప్రమాణం చేసిన ప్రచండను భారత్‌తోపాటు చైనా అభినందించింది. నేపాల్ ప్రధాని అయిన పుష్ప కమల్ దహాల్‌కు ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలతో కూడిన సందేశం పంపారు. ‘భారత్- నేపాల్ మధ్య ప్రత్యేకమైన సంబంధం ఉన్నది. లోతైన సాంస్కృతిక అనుబంధం ఉన్నది. రెండు దేశాల మధ్య సంబంధాలు ప్రజల మధ్య స్నేహపూర్వక సంబంధాలపై ఆధారపడి ఉన్నాయి. ఈ స్నేహాన్ని మరింత బలోపేతం చేయడానికి మీతో సన్నిహితంగా పనిచేయాలని నేను ఎదురుచూస్తున్నాను’ అని ట్విట్టర్లో మోదీ తన సందేశాన్ని రాశారు. కాగా, నేపాల్‌లోని చైనా రాయబార కార్యాలయం ఇంగ్లిష్, నేపాలీ భాషల్లో ట్వీట్ చేసింది. నేపాల్ 44వ ప్రధానమంత్రిగా నియమితులైనందుకు ప్రచండకు అభినందనలు. పాక్ ప్రధాని షాబాజ్ షరీఫ్ కూడా ఆయనకు అభినందనలు తెలిపారు.