వాటికన్, ఏప్రిల్ 26: పోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియలు శనివారం వాటికన్ సిటీలో సాదాసీదాగా ముగిశాయి. చెక్కతో చేసిన శవపేటికలో ఉంచిన పోప్ భౌతిక కాయాన్ని ఖైదీలు, వలసదారులు ఖననం చేశారు. అత్యంత సీనియర్ కార్డినల్స్ సమక్షంలో సెయింట్ మేరీ బాసిల్లికా చర్చి ఆవరణలో పోప్‌ను ఖననం చేసినట్టు వాటికన్ వర్గాలు తెలిపాయి.
అంత్యక్రియలకు ముందు పోప్ దేహంపై తెల్లటి వస్ర్తాన్ని, నాణేలు ఉన్న సంచిని, ఆయన పోప్‌గా ఉన్నప్పటి రికార్డ్ (రోజిటో)ను శవపేటిక లోపల పెట్టారు. పోప్ అంతిమ సంస్కారాల్లో పలువురు ప్రపంచ దేశాధినేతలు సహా రెండు లక్షల మంది ప్రజలు పాల్గొని ఆయనకు నివాళులు అర్పించారు. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్, బ్రిటన్ ప్రధాని స్టార్మర్ పోప్‌కు శ్రద్ధాంజలి ఘటించారు.