Vladimir Putin | రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Vladimir Putin) భారత పర్యటనకు వస్తున్న విషయం తెలిసిందే. డిసెంబర్ 4-5 తేదీల్లో భారత్‌ను సందర్శించనున్నారు. భారత్-రష్యా 23వ వార్షిక శిఖరాగ్ర సమావేశానికి పుతిన్ హాజరుకానున్నారు. ఈ రెండు రోజుల పర్యటనలో పుతిన్.. ప్రధాని మోదీతో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. అంతేకాదు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముతోనూ భేటీ కానున్నారు.
పుతిన్ భారత పర్యటనకు రావడం నాలుగేండ్ల తర్వాత ఇదే తొలిసారి. దీంతో పుతిన్ పర్యటన కోసం రష్యా అధికారులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. పుతిన్ భద్రతా ఏర్పాట్లను ప్రెసిడెన్షియల్ సెక్యూరిటీ సర్వీస్ చూసుకుంటుంది. వారు ఇప్పటికే భారత్‌కు వచ్చి భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. పుతిన్ బస చేసే హోటల్‌కు చేరుకొని తనిఖీలు చేసి.. రష్యా అధ్యక్షుడికి అవసరమైన అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి.
పూప్ సూట్‌కేస్‌లు..
పుతిన్ విదేశీ పర్యటనలకు వెళ్లినప్పుడు ఫుడ్, డ్రింక్స్ మొదలు.. అన్ని వస్తువులను రష్యా నుంచే తీసుకొస్తారు. పుతిన్ కోసం మొబైల్ బాత్రూమ్ను కూడా రష్యా నుంచే తీసుకొస్తారు. పుతిన్ మలాన్ని సెక్యూరిటీ గార్డ్స్ సేకరించి సీల్డ్ కవర్లో ప్యాక్ చేసి పూప్ సూట్‌కేసుల్లో భద్రపరుస్తారు. వాటిని రష్యాకు తీసుకెళ్లిపోతారు. పుతిన్ ఆరోగ్య సమాచారం విదేశీ శక్తులకు తెలియవద్దు అన్న ఉద్దేశంతోనే ఈ చర్యలు తీసుకుంటున్నట్లు నివేదికలు సూచిస్తున్నాయి.
పుతిన్ బాడీగార్డ్స్.. 35 ఏళ్లకే పదవీ విరమణ
పుతిన్ బాడీగార్డ్స్‌ను జాగ్రత్తగా ఎంపిక చేసి వారికి ప్రత్యేక శిక్షణ ఇస్తారు. ఫెడరల్ ప్రొటెక్టివ్ సర్వీస్ అకాడమీ నుంచి పట్టభధ్రులై ఉండాలి. వారికి ఇంటర్వ్యూలు, పాలిగ్రాఫ్ పరీక్షలు చేస్తారు. వారు 5.8-6.2 అడుగుల ఎత్తు, 75-90 కిలోల బరువు ఉండాలి. విదేశీ భాషలు మాట్లాడాలి. మరో విశేషం ఏంటంటే.. పుతిన్ బాడీ గార్డ్స్ 35 ఏళ్ల వయసులోనే రిటైర్ అవుతారట.
పుతిన్ బాడీ డబుల్స్..
పుతిన్ అప్పుడప్పుడు బాడీ డబుల్స్‌ను ఉపయోగిస్తారని నివేదికలు సూచిస్తున్నాయి. ముఖ్యంగా బహిరంగ కార్యక్రమాలు, అధిక ప్రమాద పరిస్థితుల్లో బాడీ డబుల్స్‌ను రష్యా అధ్యక్షుడు ఉపయోగిస్తారట. పుతిన్ కనీసం ముగ్గురు బాడీ డబుల్స్‌ను ఉపయోగిస్తారని.. వారిలో కొందరు పుతిన్‌లా కనిపించేందుకు ప్లాస్టిక్ సర్జరీలను చేయించుకున్నట్లు నివేదికలు పేర్కొన్నాయి.
నాలుగు టైర్లూ పంక్చర్ అయినా..
పుతిన్ అత్యంత ఖరీదైన, భద్రతతో కూడిన కారును ఉపయోగిస్తారు. దాని పేరు ఆరస్ సెనెట్. దీన్ని రష్యాకు చెందిన ఎన్ఏఎమ్ఐ ఇనిస్టిట్యూట్ రూపొందించింది. 2018 నుంచి పుతిన్ ఇదే కారును ఉపయోగిస్తున్నారు. ఈ కారు బుల్లెట్లు, గ్రనేడ్లు, రసాయన దాడులను కూడా తట్టుకోగలదట. ఇందులో ఎమర్జెన్సీ ఆక్సిజన్ సరఫరా సిస్టమ్, అధునాతన కమాండ్ సిస్టమ్ అందుబాటులో ఉంటుంది. ఎమర్జెన్సీ ఎగ్జిట్ కూడా ఉంటుంది. ఈ కారు గంటలకు 249 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లగలదు. దీనికి ఉన్న నాలుగు టైర్లు పంక్చర్ అయినా.. ఇది ప్రయాణించగలదు. విదేశీ పర్యటనల్లోనూ పుతిన్ ఇదే కారును ఉపయోగిస్తారు. చైనా పర్యటనలో కూడా పుతిన్ ఈ కారునే తన వెంట తెచ్చుకున్నారు. అప్పుడు ప్రధాని మోదీ, పుతిన్ ఇందులో ప్రయాణించారు.
ప్రత్యేక టెలిఫోన్ బూత్
పుతిన్ మొబైల్ ఫోన్ వాడరు. సెక్యూర్ కమ్యూనికేషన్ లైన్లోనే సంభాషిస్తారు. అందుకోసం విదేశీ పర్యటనల సమయంలో ప్రెసిడెన్షియల్ సెక్యూరిటీ సర్వీస్.. పుతిన్ కోసం ప్రత్యేక టెలిఫోన్ బూత్‌ను ఏర్పాటు చేస్తుంది. పుతిన్ బస చేసే హోటల్ గదిలోనే దీన్ని ఏర్పాటు చేస్తారు. దాని ద్వారానే పుతిన్ సంభాషనలు సాగిస్తుంటారు.
పర్సనల్ ల్యాబ్, ఫుడ్ సేఫ్టీ
పుతిన్ విదేశీ పర్యటనలకు వెళ్లినప్పుడు ఫుడ్, డ్రింక్స్ కూడా రష్యా నుంచే తెచ్చుకుంటారు. ఆహారం వండేందుకు ప్రత్యేక శిక్షణ పొందిన చెఫ్‌లు, హౌస్ కీపింగ్ బృందాన్ని కూడా రష్యా నుంచే రప్పిస్తారు. వీరి కోసం పుతిన్ బస చేసే హోటల్లో ప్రత్యేక లిఫ్ట్‌లను ఏర్పాటు చేస్తారు. ఆహారం వండిన తర్వాత వాటిని చెక్ చేసేందుకు ఓ మొబైల్ ల్యాబ్‌ను కూడా ఏర్పాటు చేస్తారు. పుతిన్ ఆహారాన్ని తీసుకునే ముందు ఈ ల్యాబ్‌లో టెస్ట్ చేస్తారు. ఆ తర్వాతే అధ్యక్షుడు ఆ ఫుడ్‌ను స్వీకరిస్తారు.
ఫ్లయింగ్ ప్లూటిన్..
పుతిన్ విమానం పేరు ఇల్యూషిన్ IL-96-300 PU. దీన్ని ఫ్లయింగ్ ప్లూటిన్ అని పిలుస్తారు. ఈ విమానంలో అధునాతన కమ్యూనికేషన్లు, క్షిపణి రక్షణ వ్యవస్థ, మీటింగ్ రూమ్స్, జిమ్, బార్, మోడికల్ ఫెసిలిటీ వంటి అత్యాధునిక సౌకర్యాలు ఉంటాయి. అంతేకాదు పుతిన్ గాల్లో ఉన్నప్పుడు అణ్వాయుధ వినియోగానికి అనుమతించేందుకు అత్యవసర అణు కమాండ్ బటన్ కూడా ఇందులో ఉంటుంది. ఈ ఫ్లయింగ్ ప్లూటిన్ 262 మందిని మోసుకెళ్లగలదు. 11,000 కిలోమీటర్లు నాన్‌స్టాప్‌గా దూసుకెళ్లగలదు.
నాలుగంచెల భద్రత..
పుతిన్ చుట్టూ నిత్యం నాలుగంచెల భద్రత ఉంటుంది. బాడీగార్డ్స్ మానవ కవచంలా ఉంటారు. వారి చేతుల్లో ఉన్న బ్రీఫ్‌కేస్ తెరిస్తే షీల్డ్‌లా మారిపోతుంది. ప్రమాదం అని తెలిస్తే.. బాడీగార్డ్స్ వెంటనే పుతిన్‌ను చుట్టుముట్టి ఆ బ్రీఫ్‌కేస్‌లను తెరుస్తారు. బహిరంగ కార్యక్రమాల్లో పుతిన్ తప్పనిసరిగా బుల్లెట్ ప్రూఫ్ జాకెట్‌ను ధరిస్తారు. పుతిన్ భద్రత విషయంలో ఆయన బాడీగార్డ్స్ చాలా స్ట్రిక్ట్ రూల్స్ పాటిస్తారు. ముప్పు ఏ రూపంలో ఉన్నా ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉంటారు. డేగ కళ్లతో నిఘా పెట్టి ఉంటారు. డ్రోన్ల ద్వారా వచ్చే ముప్పును కూడా ఎదుర్కొనేందుకు యాంటీ-డ్రోన్ సిస్టిమ్‌ను ఉపయోగిస్తారు. భద్రతా సిబ్బంది చేతిలో యాంటీ-డ్రోన్ ఇంటర్‌సెప్టర్ ఉంటుంది. ఇది బహిరంగ కార్యక్రమాల సమయంలో శత్రు డ్రోన్లను అడ్డుకోగలదు.
Also Read..
డిసెంబర్ 4-5 తేదీల్లో పుతిన్ భారత పర్యటన
Vladimir Putin: ఉక్రెయిన్ చర్చల్లో కీలక మలుపు.. ట్రంప్ దౌత్యవేత్తతో భేటీకానున్న పుతిన్
Imran Khan | ఇమ్రాన్ ఖాన్ మరణించారంటూ వార్తలు.. రావల్పిండి, ఇస్లామాబాద్‌లో భద్రత కట్టుదిట్టం