వాషింగ్టన్: ఒక విమానం టేకాఫ్ అయిన వెంటనే నియంత్రణ కోల్పోయింది. రద్దీగా ఉండే రైల్ ట్రాక్‌పై అది కూలింది. ఇంతలో ఒక రైలు ఆ ట్రాక్‌పై వేగంగా వస్తున్నది. మరోవైపు పోలీసులు ధైర్యం చేసి గాయపడిన పైలట్‌ను విమానం నుంచి బయటకు తీశారు. అంతలోనే రైలు ఆ విమానాన్ని ఢీకొట్టింది. దీంతో అది ముక్కలైంది. ఒళ్లు జలదరింపజేసే ఈ ఘటన అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో జరిగింది.
పకోయిమా పొరుగు ప్రాంతం నుంచి టేకాఫ్ అయిన చిన్న విమానంపై పైలట్ నియంత్రణ కోల్పోయాడు. దీంతో శాన్ ఫెర్నాండో రోడ్ వద్ద రైలు పట్టాల సమీపంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశాడు. ఈ క్రమంలో అందులోని పైలట్ తీవ్రంగా గాయపడ్డాడు. మరోవైపు ఆ రైలు పట్టాలపై ఒక రైలు వేగంగా వస్తున్నది. కాగా, వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు ఏ మాత్రం ఆలస్యం చేయలేదు. ఎంతో ధైర్యంతో కూలిన విమానంలో గాయపడిన పైలట్‌ను అతి కష్టంమీద అందులోంచి బయటకు తీశారు.
మరోవైపు గాయపడి తలకు రక్తం కారుతున్న పైలట్‌ను పట్టుకుని పోలీసులు దూరంగా వెళ్లేంతలోపే వేగంగా వచ్చిన రైలు ఆ విమానాన్ని ఢీకొట్టింది. దీంతో కొన్ని విమాన శిథిలాలు వారికి తగిలాయి. అనంతరం గాయపడిన పైలట్‌ను ఆసుపత్రికి తరలించారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
కాగా, ఒక పోలీస్ వద్ద ఉన్న బాడీ కెమేరాలో రికార్డైన ఈ వీడియోను లాస్ ఏంజెల్స్ పోలీస్ శాఖ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. నెటిజన్లు దీనిపై పాజిటివ్‌గా స్పందించారు. గాయపడిన పైలట్‌ను ధైర్యసాహసాలతో కాపాడిన పోలీసుల తీరును ప్రశంసించారు.