Canada | ఓక్విల్లే: కెనడా పోలీసులు ఖలిస్థానీ సిక్కు సంస్థల ఒత్తిళ్లకు తల వంచారు. ఆ దేశంలోని మైనారిటీలైన హిందువులకు భద్రత కల్పించలేమని నిస్సిగ్గుగా ప్రకటించారు. భారతీయ దౌత్యవేత్తలు ఈ నెల 23న ఓక్విల్లేలోని వైష్ణోదేవి దేవాలయంలో, ఈ నెల 30న స్కాబరోలోని లక్ష్మీ నారాయణ మందిరంలో లైఫ్ సర్టిఫికెట్ క్యాంపులను నిర్వహించవలసి ఉంది. అయితే, ఈ దేవాలయాల వద్ద నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తామని సిక్స్ ఫర్ జస్టిస్ ప్రకటించింది. దీంతో పోలీసులు వైష్ణో దేవి దేవాలయం ధర్మకర్తలపై ఒత్తిడి తేవడంతో కార్యక్రమాన్ని రద్దు చేశారు.
ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో ప్రధాని మోదీ, ఎన్ఎస్ఏ అజిత్ దోవల్, మంత్రి జైశంకర్ ప్రమేయం ఉన్నట్లు కెనడా మీడియాలో వచ్చిన కథనాలపై కెనడా స్పందించింది. వారి ప్రమేయం ఉన్నట్లు తమ ప్రభుత్వం ఎన్నడూ చెప్పలేదని తెలిపింది.