కీవ్, ఆగస్టు 20: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రైలు మార్గాన ఉక్రెయిన్‌కు వెళ్లనున్నారు. పోలాండ్, ఉక్రెయిన్ పర్యటన కోసం మోదీ 22న బయలుదేరుతారు. పోలాండ్‌లో ఆయన పర్యటన ముగిసిన అనంతరం ఉక్రెయిన్ సరిహద్దు నుంచి ‘ట్రైన్ ఫోర్స్ వన్’లో ఉక్రెయిన్ రాజధాని కీవ్ చేరుకోనున్నారు. ఇందుకోసం ఆయన 10 గంటల పాటు రైలు ప్రయాణం చేయాల్సి ఉంటుంది.
కీవ్‌లో ఏడు గంటల పాటు మోదీ ఉండనున్నారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో సమావేశమైన అనంతరం తిరిగి ఇదే రైలులో పోలాండ్ చేరుకొని అక్కడి నుంచి భారత్‌కు తిరుగు ప్రయాణం అవుతారు. విలాసవంతమైన రైలుగా గుర్తింపు పొందిన ట్రైన్ ఫోర్స్ వన్‌లో మోదీ కంటే ముందు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యూయెల్ మాక్రాన్, జెర్మన్ చాన్సిలర్ ఒలాఫ్ స్కూల్జ్ వంటి వారు ప్రయాణించారు.
రష్యాతో యుద్ధం కారణంగా ఉక్రెయిన్‌లో ప్రమాదకర పరిస్థితులు ఉన్నాయి. నిత్యం బాంబు దాడులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి భద్రతను దృష్టిలో పెట్టుకొని ఉక్రెయిన్‌లో పర్యటించే దేశాధినేతలు అందరూ ఇదే రైలులో ప్రయాణిస్తున్నారు. ఈ రైలులో స్టార్ హోటల్ తరహా సదుపాయాలు ఉంటాయి. చెక్కతో చేసిన క్యాబిన్లు, పనులు చేసుకోవడానికి టేబుల్, సోఫా, సేదతీరడానికి మంచం, టీవీ వంటి అన్ని సదుపాయాలు ఉంటాయి.